ఒకప్పుడు అమెరికా భారతీయుల కల. కానీ ఇప్పుడు అదికాస్తా పీడకలగా మారిపోయింది. ఇప్పటికే అమెరికాకు వెళ్లిన వారు, అక్కడ స్దిరపడిన వారు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, చివరికి ఇప్పుడిప్పుడే అక్కడికి వెళ్లేందుకు వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారు..
ఇలా ఎవరినీ వదలకుండా ట్రంప్ బాదేస్తున్నారు. దీంతో అమెరికా వెళ్లాలన్న కలల్ని భారతీయులు ఇక వదులుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. వీటన్నింటికీ మించిన పరిస్ధితులు అమెరికాలో ఇప్పుడు భారతీయుల్ని భయపెడుతున్నాయి.
అమెరికాలో కొంతకాలంగా వీసా తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీసాలు, గ్రీన్ కార్డులు ఉన్న వారు సైతం వాటితో బహిరంగ ప్రదేశాల్లో తిరగలేని పరిస్దితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అన్ని అనుమతులతో అమెరికాలో ఉన్నప్పటికీ ఏదో ఒక కారణం చెప్పి భారతీయుల్ని నిర్బంధించి వీసాలు, గ్రీన్ కార్డులు రద్దు చేసి వెనక్కి పంపిస్తున్న ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. దీంతో అమెరికాలో ఉన్న భారతీయులు ఎప్పడూ లేనంత దయనీయమైన పరిస్దితులు ఎదుర్కొంంటున్నారు.
అమెరికాలోకి వలసల్ని నియంత్రించేందుకు ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న చర్యల ఫలితంగా హెచ్1బీ వీసాలపై ఆంక్షలు పెరిగాయి. అదే సమయంలో ఇమ్మిగ్రేషన్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంతో అధికారుల కళ్లలో పడితే ఎక్కడ తమ వీసా రద్దవుతుందో, గ్రీన్ కార్డు లాక్కుంటారో అన్న భయం భారతీయుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయులు చాలా చోట్ల సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోతున్నారు. కేవలం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. బయటికి వెళ్లేందుకు భయపడుతున్నారు.
అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడకుండా ఉండేందుకు ఎక్కువ మంది వలసదారులు ఇప్పుడు విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉన్నారని KFF, NYT సర్వేలో వెల్లడైంది. వలసదారులే కాదు, సహజ పౌరులు కూడా అమెరికా వెలుపల ప్రయాణాలకు దూరంగా ఉన్నారు. అవసరమైన పత్రాలు ఉన్నప్పటికీ వారు ప్రయాణాలకు దూరంగా ఉన్నారని భారతీయ-అమెరికన్లపై తాజాగా ఒక మీడియా సంస్థ నివేదికలో తేలింది. న్యూయార్క్ టైమ్స్‌తో కలిసి కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ (KFF) నిర్వహించిన 2025 సర్వే ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్, ఇమ్మిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడకుండా ఉండేందుకు వలసదారులలో 27 శాతం లేదా 10 మందిలో ముగ్గురు ఉద్దేశపూర్వకంగా దేశం లోపలా, బయటా ప్రయాణాలు చేయట్లేదని తేలింది.
చెల్లుబాటు అయ్యే H-1B వీసాలు కలిగిన వారు, సాధారణ పౌరులతో సహా చట్టబద్ధంగా ఉన్న వలసదారులు కూడా ప్రయాణాలకు దూరంగా ఉన్నారని ఈ సర్వేలో తేలింది. పత్రాలు లేని వలసదారులలో ఈ సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంది. సర్వే అంచనా ప్రకారం దాదాపు మూడింట రెండు వంతుల మంది లేదా 63 శాతం మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉన్నారు. వాస్తవానికి అమెరికాలో వార్షిక సెలవుల సీజన్. అయినా వీరు ఇళ్లు వదిలి రావట్లేదు. డిసెంబర్ వరకూ దేశీయంగా తిరిగే విమానాలపై ఇమ్మిగ్రేషన్ తనిఖీలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు అమెరికాలో తిరిగే విమానాల్లోనూ తనిఖీలు ఎక్కువయ్యాయి. తాజా నివేదిక ప్రకారం, అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండే వలసదారుల అరెస్టు, నిర్బంధం, బహిష్కరణ కోసం ఫెడరల్ ఏజెన్సీలలో డేటా షేరింగ్‌ను విస్తరించడానికి ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నారు.

































