తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం.. టీటీడీ సిబ్బంది భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.
అర్థరాత్రి 1.30 గంటల నుంచి రాత్రి 11.45 గంటల వరకూ.. సుమారు 20 గంటలపాటు 70 వేలమందికి పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. తొలుత వీఐపీలకు, ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పిస్తోంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 1వ తేదీ వరకూ ముందుగా దర్శన టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. ఆధార్, దర్శన ప్రింటెడ్ టోకెన్లను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. కృష్ణతేజ, ATGH, శిలాతోరణం పాయింట్ల వద్ద ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. టోకెన్లు లేని భక్తులను జనవరి 2 నుంచి 8వ తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల అంతా విద్యుద్దీప కాంతులతో, పుష్పాలంకరణలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. టీటీడీ ఉద్యానవన విభాగం సుమారు 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లు, 4 లక్షల కట్ ఫ్లవర్స్ తో ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించారు. తిరుమలకొండలు రంగురంగుల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి.


































