జనవరి 1, 2026 నుండి విక్రయించే అన్ని వాహనాలకు ‘ఏబీఎస్’ (ABS – Anti-lock Braking System) బ్రేక్ సిస్టమ్ ఉండటం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వచ్చే ఏడాది జనవరి నుండి తయారయ్యే అన్ని కొత్త టూవీలర్లకు ఏబీఎస్ సిస్టమ్‌ను కేంద్ర రవాణా శాఖ నిర్బంధం చేసింది. ఈ నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వాలని వాహన తయారీ సంస్థలు కోరినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అందుకు నిరాకరించింది. ఇంజిన్ సామర్థ్యంతో (CC) సంబంధం లేకుండా అన్ని రకాల ద్విచక్ర వాహనాలకు ఈ రూల్ వర్తిస్తుంది.
ABS మరియు హెల్మెట్ నిబంధనలు:
కేంద్ర రవాణా శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు తయారీదారులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ధృవీకరించిన రెండు నాణ్యమైన హెల్మెట్లను విధిగా అందించాలి.
“జనవరి 1, 2026 మరియు ఆ తర్వాత ఉత్పత్తి చేయబడే అన్ని L2 కేటగిరీ వాహనాలకు IS14664:2010 ప్రమాణాలకు అనుగుణంగా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉండాలి.”
ABS అంటే ఏమిటి? అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ అయిపోయి వాహనం జారిపోకుండా (Skidding) ఈ సిస్టమ్ అడ్డుకుంటుంది. దీనివల్ల ప్రమాదాల తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. 2022లో జరిగిన 1.5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 20% ద్విచక్ర వాహనదారులే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.
డ్రైవింగ్ లైసెన్స్‌లో ‘నెగటివ్ పాయింట్స్’ సిస్టమ్:
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ‘నెగటివ్ పాయింట్స్ విధానాన్ని’ ప్రవేశపెట్టనుంది.
- హెల్మెట్ లేకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి తప్పులు చేసినప్పుడు మీ లైసెన్స్‌కు నెగటివ్ పాయింట్లు కేటాయిస్తారు.
- ఈ పాయింట్లు ఒక నిర్దిష్ట పరిమితి దాటితే, మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తారు.
- నిరంతరం నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉంది.
భారీగా పెరిగిన జరిమానాలు:
కొత్త నిబంధనల ప్రకారం పెరిగిన జరిమానా వివరాలు ఇలా ఉన్నాయి:
- మద్యం సేవించి వాహనం నడపడం: గతంలో ₹1,000-₹1,500 ఉండగా, ఇప్పుడు మొదటిసారి పట్టుబడితే ₹10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి దొరికితే ₹15,000 జరిమానా మరియు రెండేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది.
- హెల్మెట్ లేకపోవడం: జరిమానా ₹100 నుండి ₹1,000కి పెంచారు. అంతేకాకుండా 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తారు.
- సీట్ బెల్ట్ ధరించకపోవడం: దీనికి ₹1,000 జరిమానా విధిస్తారు (గతంలో ₹100 మాత్రమే ఉండేది).
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడటం: గతంలో ₹500 ఉండగా, ఇప్పుడు దీనిని ₹5,000కి పెంచారు. ఇలాంటి పొరపాట్లకు నెగటివ్ పాయింట్లు కూడా ఇస్తారు.

































