సుమ ఇటీవల చేసిన ఓ వీడియోకు వచ్చిన కామెంట్స్‌లో ఒక ఫ్యాన్ ప్రభాస్ గురించి మాట్లాడమని అడిగాడు. సాధారణంగా అయితే హీరోను పొగిడే రెండు మాటలు చెప్పి వదిలేసేవారు. కానీ సుమ మాత్రం ప్రభాస్‌లోని నిజమైన మనసును చూపించే ఒక వ్యక్తిగత అనుభవాన్ని అందరితో పంచుకున్నారు. ఆయన ఎంత మంచి మనసున్న వ్యక్తో, ప్రచారం ఆశించకుండా సేవ చేయడం ఎంత అరుదైన విషయమో ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది.
సుమ చెబుతూ.. “కొన్ని సంవత్సరాల క్రితం నేను ఖమ్మం వృద్ధాశ్రమ నిర్మాణంలో సహాయం చేశాను. పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు ఇంకా మరికొంత మంది సెలబ్రిటీలు మనస్ఫూర్తిగా ఆ ఆశ్రమం పూర్తి కావడానికి సహకరించారు.” అని చెప్పుకొచ్చింది.
అయితే సుమను ఎక్కువగా కదిలించిన విషయం ఆశ్రమం నిర్మాణం పూర్తైన తర్వాత జరిగిన విషయం. చాలా మంది సెలబ్రిటీలు ఒకసారి సహాయం చేసి అక్కడితో ఆపేస్తారు. కానీ ప్రభాస్ మాత్రం అలా చేయలేదని ఆమె చెప్పారు. ఆశ్రమం పూర్తైన తర్వాత కూడా అక్కడి వృద్ధుల అవసరాలు గుర్తించి, ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని పంపుతూ ఆశ్రమ నిర్వహణకు అండగా నిలుస్తున్నారని సుమ వెల్లడించారు. ” ప్రభాస్ గారు వృద్ధుల కోసం నెలనెలా ఒక మొత్తం పంపుతూ ఆశ్రమాన్ని నడిపించడానికి సహాయం చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల పాటు ఇలా నిరంతరంగా సహకరించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆయన మంచి మనసుకు నిజంగా అభినందనలు” అంటూ సుమ ప్రశంసించారు. అలాగే మేము సైతం కార్యక్రమం ద్వారా సహాయం చేసిన లక్ష్మీ మంచుకు కూడా ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విషయం ఇప్పుడే బయటకు వచ్చినది కాదు. కొద్ది నెలల క్రితం సుమ భర్త, నటుడు రాజీవ్ కనకాల కూడా ఇదే అంశాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. మహా మ్యాక్స్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన రాజీవ్, ఆ వృద్ధాశ్రమానికి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా విరాళం ఇచ్చారని చెప్పారు. అయితే ప్రభాస్ మాత్రం ఇప్పటికీ ఆ ఆశ్రమం నిర్వహణకు డబ్బు పంపుతూనే ఉన్నారని ప్రత్యేకంగా పేర్కొన్నారు.
సినిమాల పరంగా చూస్తే ప్రభాస్ కెరీర్ కూడా ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. 2023లో ఆయన నటించిన ఆదిపురుష్, సలార్: పార్ట్ 1 సినిమాలు రిలీజైయ్యాయి. 2024లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’తో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆయన నటించిన ‘ది రాజా సాబ్’, సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న విడుదల కానుంది. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాల్లో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. మొత్తానికి సినిమాల్లో హీరోగా మాత్రమే కాదు, నిజ జీవితంలో మనసున్న వ్యక్తిగా కూడా ప్రభాస్ మరోసారి అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు.


































