దేశం మొత్తాన్ని షాక్‌కు గురిచేసిన స్కూటర్.. 200 శాతం పెరిగిన సేల్స్

భారతదేశ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఫ్యామిలీ స్కూటర్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజువారీ అవసరాలు, కుటుంబ వినియోగం, సౌకర్యవంతమైన రైడింగ్, తక్కువ మెయింటెనెన్స్ వంటి అంశాల కారణంగా ఈ సెగ్మెంట్‌లో హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్, టీవీఎస్ జూపిటర్ లాంటి స్కూటర్లు సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.


అయితే దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ మాత్రం గేర్‌లెస్ స్కూటర్ విభాగంలో తనకు తగ్గ స్థానం సంపాదించుకోవడంలో ఇప్పటివరకు తడబడుతూనే ఉంది. హీరో గత కొన్ని సంవత్సరాల్లో యువతను ఆకర్షించే ఉద్దేశంతో జూమ్ 110, జూమ్ 125, జూమ్ 160 వంటి కొత్త తరం స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

డిజైన్, ఫీచర్లు, స్పోర్టీ లుక్ పరంగా ఇవి ఆధునికంగానే ఉన్నప్పటికీ, అమ్మకాల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోయాయి. హోండా, సుజుకి, యమహా, టీవీఎస్ లాంటి బ్రాండ్లు ఇప్పటికే బలమైన నమ్మకం, పెద్ద కస్టమర్ బేస్‌తో మార్కెట్‌ను పట్టుకుని ఉండటమే హీరోకు ప్రధాన సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో హీరోకు ఊరటనిచ్చింది డెస్టిని 125 కొత్త వెర్షన్.

కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ఫ్యామిలీ స్కూటర్‌గా పొజిషన్ చేసిన ఈ మోడల్‌కు తాజాగా ఇచ్చిన డిజైన్ అప్‌డేట్స్, మెరుగైన లుక్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పాత పనివాడికి కొత్త లుక్ అన్నట్లుగా, డెస్టిని రూపురేఖల్లో చేసిన మార్పులు హీరో షోరూమ్‌లకు జనాన్ని రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీని ప్రభావం అమ్మకాల గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

నవంబర్‌లో మాత్రమే డెస్టిని 125 మొత్తం 27,036 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే నెలలో, అంటే నవంబర్ 2024లో కేవలం 8,875 యూనిట్లకే పరిమితమైంది. అంటే ఏడాది వ్యవధిలో అమ్మకాలు రెట్టింపుకంటే ఎక్కువగా పెరిగినట్టే. ఈ దూకుడు వృద్ధితో డెస్టిని 125 వార్షిక అమ్మకాల వృద్ధిలో 204.63 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ సంఖ్యలు హీరోకు గేర్‌లెస్ స్కూటర్ సెగ్మెంట్‌లో కొత్త ఆశను కలిగిస్తున్నాయి.

హీరో డెస్టినీ 125 స్కూటర్‌ను చూస్తే, కేవలం రూపంలోనే కాదు, ఇంజిన్ పరంగా బలంగా తయారైందనే భావన స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్కూటర్‌కు శక్తినిచ్చేది 124 సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్. కుటుంబ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ట్యూన్ చేసిన ఈ ఇంజిన్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. అందువల్ల నగర ట్రాఫిక్‌లో అయినా, రోజువారీ ప్రయాణాల్లో అయినా రైడర్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

పనితీరు విషయానికి వస్తే, ఈ ఇంజిన్ 7,000 rpm వద్ద 9 bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు. అలాగే 5,500 rpm వద్ద 10.4 Nm టార్క్‌ను అందించడం వల్ల తక్కువ వేగంలో కూడా మంచి పికప్ లభిస్తుంది. ముఖ్యంగా భారతీయ వినియోగదారులు ఎక్కువగా చూసే మైలేజీ విషయంలో హీరో డెస్టినీ నిరాశపరచదు. కంపెనీ తెలిపిన ప్రకారం ఇది లీటరుకు సుమారు 59 కి.మీ వరకు మైలేజీని అందించగలదు.

ఫీచర్ల పరంగా కూడా హీరో డెస్టినీ 125 ఆధునికతను అందిపుచ్చుకుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండటంతో స్పీడ్, ఫ్యూయల్ లెవెల్, ట్రిప్ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు, బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్‌తో పాటు టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్లు సాధారణంగా ఖరీదైన స్కూటర్లలోనే కనిపించేవి కావడంతో, డెస్టినీకి ఇది మంచి ఆధిక్యతగా మారింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.