ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీలు, పట్టణాలు మరియు నగరాల్లోని వార్డు సచివాలయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని ‘వార్డు సచివాలయం’ అని కాకుండా ‘స్వర్ణ వార్డు’గా పిలవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఈ మేరకు వార్డు సచివాలయాల పేరును స్వర్ణ వార్డులుగా మార్చే ప్రతిపాదనకు కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ మార్పు ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ పేరు మార్పుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా అధికారికంగా గెజిట్‌ను కూడా విడుదల చేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఈ తాజా మార్పుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల బోర్డులు, అధికారిక రికార్డుల్లో ఇకపై ‘స్వర్ణ వార్డు’ అనే పేరు అమల్లోకి రానుంది. పాలనలో సంస్కరణలు తీసుకువస్తూ, ప్రజలకు చేరువయ్యే క్రమంలో ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.

































