రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సర వేళ భారీ కానుకే ప్రకటించింది. విద్యుత్ వినియోగదారులకు భారీ ఉపశమనమిచ్చే కబురు అందించింది. సుమారు రూ.4,497.89 కోట్ల ట్రూ అప్ చార్జీల భారాన్ని జనంపై మోపకుండా.. ఆ మొత్తం తానే భరించేందుకు సిద్ధమైంది. గత సెప్టెంబరులో రూ.923 కోట్లను ట్రూడౌన్ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమంటూ 2024 ఎన్నికల్లో చంద్రబాబు స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నర కాలంలో ఒక్క రూపాయి కరెంటు భారాన్ని కూడా ప్రజలపై వేయలేదు. పైగా 2025 నవంబరు నుంచి ట్రూడౌన్‌లో భాగంగా వినియోగదారులు ఉపయోగించే ఒక్కో యూనిట్‌పై 13 పైసలు తగ్గింపు ఇస్తూ వస్తున్నారు. తాజాగా సుమారు రూ.4,498 కోట్ల భారాన్ని వారిపై మోపకుండా ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు.
రూ.12,771 కోట్లకు ప్రతిపాదిస్తే..
ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) 2019-20 నుంచి 2023-24 వరకు వినియోగదారులు వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన ట్రూ అప్పై ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం.. మూడు డిస్కంలు విద్యుత్ సరఫరాకు అయిన ఖర్చుకు.. ఆదాయానికి మధ్య వ్యత్యాసం రూ.12,771.96 కోట్లుగా పేర్కొన్నాయి. ఈ మొత్తంలో రూ.8,274.07 కోట్లను ఏపీఈఆర్సీ అనుమతించలేదు. ఇందులో క్వారీయింగ్ కాస్ట్ రూ.4,149.70 కోట్లు, ఇతర ఖర్చులు, బిల్ డిస్కౌంటింగ్, బ్యాడ్ డెట్స్, షార్ట్ టర్మ్ రుణాల వంటివి ఉన్నాయి. ఏపీఈఆర్సీ తిరస్కరించిన మొత్తం తర్వాత నికర ట్రూ అప్ రూ.5,933.44 కోట్లకు తగ్గింది. దీని నుంచి గత ఆదేశాల్లో సర్దుబాటు చేసిన రూ.1,435.55 కోట్లను కూడా తగ్గించిన తర్వాత నికర మొత్తం రూ.4,497.89 కోట్లుగా తేలింది. ఈ నికర ట్రూ అప్ మొత్తాన్ని డిస్కంల వారీగా విభజిస్తే.. ఏపీఎస్పీడీసీఎల్కు రూ.1,551.69 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ రూ.1,163.05 కోట్లు, ఏపీఈపీడీసీఎల్‌కు రూ.1,783.15 కోట్లుగా ఉంది. నికర ట్రూఅప్ మొత్తాన్ని వినియోగదారులకు సర్దుబాటు చేస్తే వారిపై భారీ భారమే పడుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీలను పెంచకూడదని స్థిరచిత్తంతో ఉన్న ప్రభుత్వం ఆ మొత్తాన్ని తానే భరించేందుకు సిద్ధమైంది. ట్రూఅప్ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని బుధవారం ఏపీఈఆర్సీకి ప్రభుత్వ ఉన్నతాధికారులు లేఖ (ఈఎన్ఈ01/872/2025-పవర్1) రాశారు. దీంతో వినియోగదారులపై ఎలాంటి భారం పడకుండా, కరెంటు చార్జీలు పెంచకుండా ఉండడానికి అవకాశం లభించిందని ఏపీఈఆర్సీ వర్గాలు తెలిపాయి. డిస్కంలు ఈ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి పొందాలని కమిషన్ ఆదేశించింది.



































