జనవరి 1, 2026 గురువారం అనగా నేడు ఆంగ్ల సంవత్సరం మొదలు అయ్యింది. 2026 జనవరి నెల క్యాలెండర్, పండుగలు, సెలవులు, రాశిఫలాలు, మరియు 2026 సంవత్సరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు ఈ కథనంలో అందుబాటులో ఉన్నాయి. ఈ నెలలో కొన్ని ముఖ్యమైన శుభకార్యాలు కూడా జరుగుతాయి. జనవరి 2026 వ్రతాలు, పండుగలు లిస్ట్ ఇదిగో.
2026 జనవరి 1వ తేదీ గురువారం నాడు నూతన సంవత్సరం మొదలు అయ్యింది. 2025 సంవత్సరంలో ఉన్నట్లే, కొత్త సంవత్సరం 2026 లో కూడా పండుగల తేదీల విషయంలో కాస్త గందరగోళం ఉంది. ముఖ్యంగా హోళీ మరియు దీపావళి పండుగల తేదీలపై కాస్త కన్ఫ్యూజన్ వుంది.
హోలీ 2026 ఎప్పుడు వచ్చింది?
హోలీ పండుగ రోజున గ్రహణం ఉంది. సాధారణంగా హోలికి ముందు రోజు హోలికా దహనం చేస్తారు. గ్రహణం వలన హోలికా దహనం ఏ రోజున చేయాలి అనే విషయంలో సందేహం వస్తుంది. అయితే, రంగులు చల్లుకుని హోళీ జరుపుకునే రోజు మార్చి 4గా నిర్ణయించబడింది. గ్రహణాలు, తిథుల మార్పుల వల్ల 2026లో కూడా కాస్త పండుగల తేదీలపై అయోమయం ఏర్పడింది.
3 జనవరి 2026, శనివారం- పుష్య పూర్ణిమ
6 జనవరి 2026, మంగళవారం- సంకటహర చతుర్థి
14 జనవరి 2026, బుధవారం- భోగి పండుగ, షట్తిల ఏకాదశి
14 జనవరి 2026, గురువారం- మకర సంక్రాంతి
16 జనవరి 2026, శుక్రవారం- కనుమ పండుగ, ప్రదోష వ్రతం, మాస శివరాత్రి
18 జనవరి 2026, ఆదివారం- అమావాస్య
23 జనవరి 2026, శుక్రవారం- వసంత పంచమి
25 జనవరి 2026, ఆదివారం- రథ సప్తమి
26 జనవరి 2026, సోమవారం- భీష్మ అష్టమి
29 జనవరి 2026, గురువారం- జయ ఏకాదశి
30 జనవరి 2026, శుక్రవారం- ప్రదోష వ్రతం
ప్రదోష వ్రతం నాడు పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మంచి జరుగుతుందని, సంతోషంగా ఉండొచ్చని నమ్ముతారు. అలాగే పుష్య పౌర్ణమి నాడు చంద్రుడిని ఆరాధించి కొన్ని పరిహారాలను పాటిస్తే సమస్యలు తీరుతాయని నమ్మకం. ఆ రోజు మా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధిస్తే ఉత్తమ ఫలితాలను చూడొచ్చు. అలాగే జనవరి 6న వచ్చే సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని ఆరాధిస్తే విఘ్నాలు అన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. భోగి మంటలు, భోగి పండ్లు, గంగిరెద్దులు, గాలిపటాలను ఎగుర వేయడం, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, పిండి వంటలతో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ జరుపుకుంటాము.
షట్తిల ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధించాలి. మాస శివరాత్రి నాడు శివుడిని పూజించాలి. వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ఆరాధించాలి. అక్షరాభ్యాసం అవ్వని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఇది ఉత్తమ రోజు. రథ సప్తమి నాడు సూర్యుడిని పూజించి, చిక్కుడు ఆకుల్లో పరమాన్నం వేసి నైవేద్యం పెడతారు. జయ ఏకాదశి చాలా విశేషమైన రోజు. ఆ రోజున కూడా విష్ణువుని భక్తితో ఆరాధిస్తే మంచిది.



































