కరోనా సంక్షోభం తీవ్రంగా ఉన్న 2020 మార్చి నుంచి మే వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లలో కోత విధించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ నిర్ణయం పెన్షనర్లకు ఏమాత్రం నచ్చలేదు. పైగా వారికి ఈ కోతలు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించాయి. ఈ మొత్తాలను తిరిగి చెల్లించాలనీ, అలాగే వడ్డీ కూడా ఇవ్వాలని పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేశాయి.
2023లో తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో కీలక తీర్పు ఇచ్చింది. కోత విధించిన పెన్షన్ మొత్తాలపై 6 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వెంటనే 2023లోనే గత ప్రభుత్వం కోత విధించిన అసలు పెన్షన్ మొత్తాలను పూర్తిగా విడుదల చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ మొత్తాలపై 6 శాతం వడ్డీగా లెక్కించి రూ.25 కోట్లను చెల్లించేందుకు ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డబ్బు అతి త్వరలో అకౌంట్లలో జమ కానుంది. అది వస్తే, అక్కడితో ఈ సమస్య తీరినట్లే. ఐతే.. ఇలా తమ మనీ తాము దక్కించుకునేందుకు పెన్షనర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. అందర్నీ ఆదుకుంటామని చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. పెన్షనర్లకు కోతలు పెట్టడంపై జేఏసీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ప్రభుత్వ నిర్ణయం లక్షల మంది పెన్షనర్లకు ఊరట కలిగించింది. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ వడ్డీ కోసం చాలాకాలం నుంచి పోరాడుతూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యపై ఫోకస్ పెట్టి.. ఇప్పుడు పరిష్కరించడం పట్ల పెన్షనర్లలో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఆర్థిక శాఖ ఉత్తర్వులతో ఈ మొత్తం త్వరలోనే పెన్షనర్ల ఖాతాల్లో జమ అవుతుందని అధికారులు తెలిపారు.


































