భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ 2027లో పట్టాలెక్కనుంది.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం దీనిపై ఓ ప్రకటన చేశారు. 2027 ఆగస్టు 15న భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ సిద్ధంగా ఉంటుంది తెలిపారు.
“మొదటగా సూరత్ నుంచి బిలిమోరా వరకు సర్వీసులు ఉంటాయి. ఆ తర్వాత వాపీ నుంచి సూరత్ వరకు, అనంతరం వాపీ నుంచి అహ్మదాబాద్ వరకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత థానే నుంచి అహ్మదాబాద్ వరకు సర్వీసులు ఉంటాయి. చివరగా ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు సేవలు ప్రారంభమవుతాయి” అని తెలిపారు.
“బుల్లెట్ ట్రెయిన్ కోసం ఇప్పుడే టికెట్ కొనుగోలు చేయవచ్చు, 2027 నాటికి ఇది సర్వీసులోకి వస్తుంది” అని అశ్విని వైష్ణవ్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టులో చివరగా 508 కిలోమీటర్ల ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రారంభం కానుంది.
గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ పరుగులు
ఈ మార్గంలో వయాడక్ట్‌లు, వంతెనలు, సొరంగాలు, స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ కారిడార్‌లో గరిష్ఠంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ నడుస్తుంది. ప్రయాణ సమయం 2 గంటలలోపే ఉంటుంది. అంటే, బుల్లెట్ ట్రైన్ ప్రారంభమైన తర్వాత ముంబై నుంచి అహ్మదాబాద్‌కు 2 గంటలలోపే చేరుకోవచ్చు.
వయాడక్ట్ (భూమిపైన స్తంభాలపై నిర్మించే ఎత్తైన రైలు మార్గం) పనుల్లో ఇప్పటికే 320 కిలోమీటర్లు పూర్తయ్యాయి. భూసేకరణ, సొరంగ నిర్మాణం, స్టేషన్ నిర్మాణం, విద్యుద్ధీకరణ పనులు ఒకేసారి కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
షింకన్‌సెన్ (జపాన్‌కు చెందిన అధిక వేగ రైళ్లకు సంబంధించిన సాంకేతికత) ప్రమాణాలు, భారతీయ ఇంజినీరింగ్‌ను కలిపి ఈ ప్రాజెక్టులో ముందుకు వెళ్తున్నారు. 2027లో తొలి ఆపరేషనల్ రన్ జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి కారిడార్ కార్యకలాపాలు 2029 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.






























