ఫిబ్రవరి 1 నుండి సిగరెట్‌, పాన్‌ మసాలాపై 40 % జీఎస్టీ

కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై కొత్త సెస్ విధించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.


పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై విధించే ఈ కొత్త పన్నులు జీఎస్టీ రేటుకు అదనంగా ఉంటాయి. ప్రస్తుతం ఇటువంటి హానికరమైన వస్తువులపై విధిస్తున్న పరిహార సెస్ స్థానంలోకి వస్తాయి. ఫిబ్రవరి 1 నుంచి ఈ నూతన పన్ను రేట్లు అమలులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం రోజున నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం… ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు, పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ రేటు వర్తిస్తుంది. అయితే బీడీలపై 18 శాతం వస్తు సేవల పన్ను అమలులోకి వస్తుంది. ఇందుకు అదనంగా పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ విధించబడుతుంది. అలాగే పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం విధించబడుతుంది. నమిలే పొగాకు, జర్దా సువాసనగల పొగాకు, గుట్కా ప్యాకింగ్ యంత్రాల (సామర్థ్య నిర్ధారణ, సుంకం వసూలు) నియమాలు, 2026ను కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫై చేసింది. ఇక, పాన్ మసాలా తయారీపై కొత్త ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్… పొగాకుపై ఎక్సైజ్ సుంకం విధించడానికి అనుమతించే రెండు బిల్లులను పార్లమెంటు డిసెంబర్‌లో ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా ధరలు భారీగా పెరగనున్నాయి.

‘హెల్త్‌ సెక్యూరిటీ సే నేషనల్‌ సెక్యూరిటీ సెస్‌ బిల్లు-2025’ బిల్లును ఆమోదించిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ.. ‘పాన్‌మసాలపై ఇప్పటికే 40శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీనికి సెస్‌ అదనం. తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సమకూరే నిధులను జాతీయ భద్రత బలోపేతానికి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నాం” అని వెల్లడించారు.

నష్టాల్లోకి ఐటీసీ షేర్లు

కేంద్రం నోటిఫికేషన్‌తో సిగరెట్ కంపెనీలైన ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి ఆ ఉత్పత్తుల ధరలు పెరగనుండటంతో అమ్మకాలు తగ్గనున్నాయనే అంచనాల నేపథ్యంలో ఈ స్టాక్స్ నష్టపోయాయి. బీఎస్‌ఈలో ఐటీసీ షేరు ధర 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది. ఫిలిప్స్ షేరు 10 శాతం కుంగింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.