‘రంగస్థలం’.. రామ్ చరణ్ కెరీర్లో మైలురాయి లాంటి సినిమా. అప్పటివరకు ఉన్న ఇమేజీని ఒక్కసారిగా మార్చేసింది. ఎంత మంచి నటుడో అందరికీ తెలిసేలా చేసింది.
ఈ మూవీలో క్లైమాక్స్ ముందొచ్చే ‘ఒరయ్యో’ అనే సాంగ్.. ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకునేలా చేసింది. అయితే ఈ పాట, దర్శకుడు సుకుమార్‌కి తొలుత అస్సలు నచ్చలేదట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రచయిత చంద్రబోస్ ఈ విషయాన్ని చెప్పారు. ఈ గీతం వెనకున్న గమ్మత్తయిన సంఘటనల్ని బయటపెట్టారు.
”రంగస్థలం’ కోసం నాలుగు రోజుల్లో నాలుగు పాటలు సిద్ధం చేశాం. సుకుమార్ మరో పాట కూడా కావాలనేసరికి.. ఇంత వేగంగా వద్దులేండి. మళ్లీ దిష్టి తగులుతుందేమో అని ఆయనతో అన్నాను. లేదు రాయాల్సిందే అని చెప్పడంతో ‘ఒరయ్యో..’ పాట రాశాను. ఇది మొదట్లో సుకుమార్‌కి నచ్చలేదు. ఈ విషయాన్ని నాకు తెలియనివ్వలేదు. అప్పటికే షూటింగ్ దగ్గర పడింది. దీంతో పాటలో సీన్స్ తీస్తున్నప్పుడు విషాద వాతావరణం ఉండటం కోసం తమిళ, మలయాళ పాటల్ని ప్లే చేశారు. కానీ సెట్లో ఒక్కరు కూడా ఏడవలేదు. పైపెచ్చు నవ్వుకున్నారు. ఎంతకీ ఎమోషన్ రాకపోయేసరికి చివరగా ‘ఒరయ్యో..’ పాట పల్లవిని ప్లే చేశారు. దీంతో అందరికీ దుఖం పొంగుకొచ్చింది. సుకుమార్‌కి ఈ పాటలో విషయం ఉందనేది అర్థమైంది’ అని చంద్రబోస్ చెప్పుకొచ్చారు.
‘షూటింగ్ చేస్తున్నప్పుడు పల్లవితో మేనేజ్ చేశాం. అయితే పాటంతా రాయడం పూర్తి చేసిన తర్వాత దేవి, సుకుమార్‌కి వినిపించా. ఆ టైంలోనే దేవి తండ్రి, సుకుమార్ తండ్రి చనిపోయారు. దీంతో పాటలో పల్లవి, చరణాలు వినిపిస్తున్నప్పుడు ప్రతిఒక్కరం ఎమోషనల్ అయ్యాం. చివరగా దేవి.. ఈ పాట నన్నే పాడమని అన్నాడు. వద్దులేండి ఎవరైనా ప్రొఫెషనల్ సింగర్‌తో పాడించండి అని చెప్పా. లేదు మీ వాయిస్ బాగుంటుందని నాతో పాడించాడు. 45 నిమిషాల్లో ఈ పాట పాడేశాను. తర్వాత ఇంత తర్వగా పాడటం పూర్తి చేశానేంటి అని ఆశ్చర్యపోయాను’ అని చంద్రబోస్ అప్పటి అనుభవాన్ని బయటపెట్టారు.
పాట సందర్భం విషయానికొస్తే.. అప్పటివరకు చిట్టిబాబు(రామ్ చరణ్), కుమార్ బాబు(ఆది పినిశెట్టి) సరదాగా ఉంటారు. సడన్‌గా కుమార్ బాబు పాత్ర చనిపోతుంది. సరిగ్గా అప్పుడు ఈ గీతం వస్తుంది. ‘ఈ సేతితోనే పాలు పట్టాను.. ఈ సేతితోనే బువ్వ పెట్టాను.. ఈ సేతితోనే తలకు పోశాను.. ఈ సేతితోనే కాళ్లు పిసికాను.. ఈ సేతితోనే పాడే మొయ్యాలా.. ఈ సేతితోనే కొరివి పెట్టాలా.. ఓరయ్యో.. నా అయ్యా..’ అనే లిరిక్స్‌తో సాంగ్ ఉంటుంది. సినిమా హిట్ విషయంలో చరణ్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ ఎలాంటి పాత్ర పోషించాయో.. ఈ గీతం కూడా అంతే ప్లస్ అయిందని చెప్పొచ్చు. అలాంటి పాట సుకుమార్‌కి మొదట నచ్చలేదని చంద్రబోస్ చెప్పడం ఆసక్తికకరంగా అనిపించింది.

































