ది రాజా సాబ్‌లో ఆయనది కథను మలుపు తిప్పే పాత్ర- ఆ 15 నిమిషాలు మ్యాజిక్కే

ప్రభాస్ నటించిన కామెడీ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ సీనియర్ నటుడు బొమన్ ఇరానీ గురించి దర్శకుడు మారుతి పంచుకున్న విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. కొత్త తరహా హారర్ కామెడీ ఫాంటసీ జోనర్‌లో వస్తున్న ది రాజా సాబ్ సినిమా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది.


డైరెక్టర్ మారుతి కామెంట్స్

ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ దర్శకుడు మారుతి తాజాగా సినిమాలోని ఒక కీలక పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ వెండితెరపై విలక్షణ నటనకు మారుపేరుగా నిలిచిన బొమన్ ఇరానీ ది రాజా సాబ్‌లో సైకియాట్రిస్ట్ (మనోవైద్యుడు) పాత్రలో కనిపించనున్నారు.

కథను మలుపు తిప్పే పాత్ర

బొమన్ ఇరానీ పాత్ర గురించి మారుతి మాట్లాడుతూ.. “ది రాజా సాబ్ సినిమాలో బొమన్ ఇరానీ పాత్ర ఎంతో కీలకం. ట్రైలర్‌లో చూసినట్లుగా ఆయన మేకోవర్ చాలా కొత్తగా ఉంటుంది. కథలో ఆయన పాత్ర ప్రవేశించిన తర్వాత సినిమా టోన్ ఒక్కసారిగా మారిపోతుంది. హారర్ కామెడీ నుంచి ప్రేక్షకులు ఊహించని ఒక కొత్త మలుపు వైపుకు కథ వెళ్తుంది” అని వివరించారు.

భాషా బేధం లేకుండా పరకాయ ప్రవేశం

బొమన్ ఇరానీ నటనను మారుతి ఆకాశానికెత్తారు. “కథ విన్న వెంటనే ఆయన ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. తన డైలాగులను తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ ఎంతో అద్భుతంగా పలికారు. ఈ సినిమాలో ఆయన నిడివి కేవలం 15 నుంచి 16 నిమిషాలు మాత్రమే ఉండొచ్చు. కానీ, ఆ ఉన్నంతసేపు ప్రేక్షకులు ఆయన నటన మాయాజాలానికి మంత్రముగ్ధులు కావడం ఖాయం. నేను చెప్పడం కంటే మీకు చూస్తే తెలుస్తుంది” అని డైరెక్టర్ మారుతి పేర్కొన్నారు.

సంక్రాంతి రేసులో రాజా సాబ్

ఇదిలా ఉంటే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ది రాజా సాబ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తిని అమ్మాలనుకునే ఒక యువకుడికి, ఆ క్రమంలో ఎదురైన అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే ఘర్షణగా ఈ సినిమా కథ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ముగ్గురు ముద్దుగుమ్మలు

ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీలు మారినప్పటికీ చివరకు ది రాజా సాబ్ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రానున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పలు భారీ తెలుగు, తమిళ చిత్రాలతో పోటీ పడనుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్మాళవిక మోహనన్రిద్ధి కుమార్ ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా చేయగా సంజయ్ దత్ విలన్‌గా నటించాడు.

అభిమానుల ఎదురుచూపులు

హారర్, కామెడీ అంశాలను మేళవించి మారుతి ఈ చిత్రాన్ని ఎలా మలిచారో, ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో ఎలా చూపించారో చూడాలని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.