కలల ఇంటికి చైనా హంగులు

  • ఫర్నిచర్‌, శానిటరీవేర్‌, ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల కొనుగోలుకు చలో చైనా
  • పెద్ద ఎత్తున క్యూ కడుతున్న ఏపీ, తెలంగాణవాసులు
  • వేల డిజైన్లు, ఫ్యాక్టరీలు.. కి.మీ.
  • పొడవున మాల్స్‌
  • కొనుగోళ్లలో సహాయం చేయడానికి అక్కడే ఏజెన్సీలు తెరిచిన మనోళ్లు
  • పోషన్‌, గ్వాంగ్‌ఝౌలో 500 పైగా తెలుగు ఫ్యామిలీలు
  • ఫర్నిచర్‌ షాపింగ్‌ పూర్తయ్యాక అక్కడే కొద్ది రోజులు ఉండి పర్యాటక ప్రాంతాల సందర్శన
  • ఇల్లంటే.. గోడలు, పైకప్పే కాదు! ఫర్నిచర్‌, ఇంటీరియర్స్‌ కూడా!! ముచ్చటపడి కట్టుకున్న పొదరింటిని మరింత అందంగా మార్చేది అవే!! అయితే, ఇన్నాళ్లూ ఆ ఫర్నిచర్‌, ఇంటీరియర్స్‌ షాపింగ్‌ ఇక్కడే చేసిన తెలుగు ప్రజలు ఇప్పుడు ట్రెండ్‌ మార్చారు. ”ఇల్లు ఇక్కడ కడదాం.. సామాన్లు చైనాలో కొందాం” అంటూ డ్రాగన్‌ దేశంలో షాపింగ్‌కి క్యూ కడుతున్నారు. ఒకప్పుడు చైనా వస్తువులంటే చౌకబారు అనే ముద్ర ఉండేది. కానీ చైనీయులు నాణ్యతలోనూ, డిజైన్లలోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడుతుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఆ దేశానికి ఫర్నిచర్‌ కొనుగోలుకు వెళ్లేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నుంచి అమరావతిలోని రియల్టర్ల దాకా, ఎగువ మధ్యతరగతి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల నుంచి వ్యాపార వేత్తలు, సంపన్న వర్గాల వరకు అందరూ ఇప్పుడు చైనా షాపింగ్‌పై మక్కువ చూపుతున్నారు. దూరాన్ని లెక్కచేయకుండా, భాషా సమస్యను పట్టించుకోకుండా ‘చలో చైనా’ అంటున్నారు. ఎందుకు ఈ చైనా పిచ్చి? అంటే.. మన తెలుగు రాష్ట్రాల్లోని పలు దుకాణాల్లోదొరికే ఫర్నిచర్‌లో అధిక బాగం చైనా నుంచి దిగుమతి అయినవే. ఇక్కడ ఫోరూమ్‌ యజమానులు అక్కడ తక్కువ ధరకు కొని.. ఇక్కడ పన్నులు, షోరూమ్‌ నిర్వహణ, లాభం అన్నీ కలుపుకొని దాదాపు రెట్టింపు ధరకు అమ్ముతున్నారు. అదే వినియోగదారుడు నేరుగా చైనా వెళ్తే.. మద్యవర్తులు ఉండరు కాబట్టి ఆ వస్తువులన్నీ 30 నుంచి 60ు తక్కువకే లభిస్తాయి. పైగా వేలాది కొత్త డిజైన్లు దొరుకుతాయి. పుణ్యంతోపాటు పురుషార్థం అన్నట్టు.. షాపింగ్‌ పూర్తయ్యాక రెండుమూడు రోజులు అక్కడే ఉండి చైనాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూసొచ్చే వీలూ ఉంటుంది. అందుకే మనోళ్లు అక్కడికి క్యూ కడుతున్నారు.

    ఇతర దేశాలతో పోలిస్తే..

    ప్రపంచంలోనే అతిపెద్ద హార్డ్‌వేర్‌, ఫర్నిచర్‌, గృహోపకరణాల మార్కెట్లలో ఒకటి చైనా. అక్కడ ఉత్పత్తి భారీ స్థాయిలో ఉండడంతో.. బ్రాండెడ్‌ వస్తువుల స్థాయి నాణ్యత ఉన్న ఉత్పత్తులు సైతం అతి తక్కువ ధరలకే లభిస్తాయి. అయితే ఫర్నిచర్‌ అనగానే చైనాతో పాటు ఇటలీ, వియత్నాం, టర్కీ దేశాలు కూడా గుర్తొస్తాయి. కానీ.. తెలుగు వారు చైనాలోని ఫోషన్‌, గ్వాంగ్‌ఝౌ నగరాలనే ఎందుకు ఎంచుకుంటున్నారంటే.. అక్కడ ఒకే చోట వేల ఫ్యాక్టరీలు ఉండటం వల్ల పోటీ ఎక్కువగా ఉండి ధరలు తగ్గుతాయి. ఇటలీలో రూ.10లక్షలు పలికే ఒక డిజైనర్‌ సోఫాను చైనా వారు అదే క్వాలిటీతో రూ.4 లక్షలకే ఇస్తారు. టర్కీలో క్లాసిక్‌ ఫర్నిచర్‌ బాగుంటుంది. కానీ ధరలు చైనా కంటే 40శాతం ఎక్కువ. వియత్నాంలో కేవలం చెక్క ఫర్నిచర్‌ మాత్రమే దొరుకుతుంది. కానీ చైనాలో గ్లాస్‌, మెటల్‌, లెదర్‌, మార్బుల్‌, చెక్క ఇలా ప్రతిదీ దొరుకుతుంది. ఇంటీరియర్‌ డెకార్స్‌, లైటింగ్‌ షాపింగ్‌కు ప్రసిద్ధిగాంచిన థాయ్‌లాండ్‌లో ధరలు.. చైనా కంటే 20-30 శాతం ఎక్కువ. మాడ్యులర్‌ ఫర్నిచర్‌కు ప్రసిద్ధి చెందిన మలేసియాలోనూ ధరలు చైనా కంటే 15-25 శాతం ఎక్కువే. లగ్జరీ ఫర్నిచర్‌, బ్రాండెడ్‌ గృహోపకరణాలకు పెట్టింది పేరైన దుబాయ్‌లో ధరలు చైనా కంటే 30-50 శాతం అధికం. అందుకే మనోళ్లు చైనా వైపు మొగ్గుచూపుతున్నారు. మాస్‌ ప్రొడక్షన్‌ (ఒకే చోట పెద్ద ఎత్తున ఉత్పత్తి), ఫర్నిచర్‌ తయారీకి కావాల్సిన ఫోమ్‌, లెదర్‌ తదితర ముడిపదార్థాలు కూడా అక్కడే ఉండడం వల్ల రవాణా ఖర్చులు తగ్గి అక్కడ తయారీ వ్యయం తక్కువగా ఉంటోంది. అలాగే.. ఇతర దేశాలకు ఎగుమతి చేసే వస్తువులపై చైనా ప్రభుత్వం అక్కడి వ్యాపారులకు రాయితీలు ఇస్తోంది. అందుకే పలు దేశాల ప్రజలు చైనాలో ఫర్నిచర్‌ కొనుగోలుకు ఎగబడుతున్నారు. కేవలం ఫర్నిచర్‌కు సంబంధించే ఏటా అక్కడ 4 ట్రిలియన్ల వ్యాపారం నడుస్తోందంటే పరిస్థితిని ఊహించవచ్చు.

    దూరమైనా.. ధర తక్కువ..

    ప్రపంచ ఫర్నిచర్‌ రాజధానిగా పిలిచే చైనాలోని ‘ఫోషన్‌’ నగరంలో.. దాదాపు 5వేలకు పైగా ఫ్యాక్టరీలు, కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ షోరూమ్‌లు ఉంటాయి. ‘లూవ్రే’ వంటి భారీ మాల్స్‌లో రోజుకు 10 కిలోమీటర్లు నడిచినా ఆ మార్కెట్‌ పూర్తికాదు. ఇక్కడ మనదేశేంలో లక్ష రూపాయలు ఉండే సోఫా సెట్‌ లేదా డైనింగ్‌ టేబుల్‌ చైనాలో 30ు నుంచి 60ు తక్కువ దరకే లభిస్తుంది. పైగా వేల రకాల డిజైన్లు అందుబాటులో ఉంటాయి. మనకు నచ్చినట్లుగా తయారుచేయించుకునే వెసులుబాటుఉంటుంది.

    మనోళ్ల పాగా..

    చైనా ఫర్నిచర్‌, ఇంటీరియర్స్‌పై పెరుగుతున్న క్రేజ్‌ నేపథ్యంలో.. అక్కడికి వచ్చే తెలుగువారికి భాష సమస్య లేకుండా సహాయపడేందుకు మనోళ్లు చాలా మంది ఏజెన్సీలు తెరిచారు. వీటిని సోర్సింగ్‌ ఏజెన్సీలంటారు. ఆ ఏజెన్సీల నిర్వహణకు 500లకు పైగా తెలుగు కుటుంబాలు ఫోషన్‌, గ్వాంగ్‌ఝౌ నగరాల్లో స్థిరపడ్డాయంటే మనోళ్ల కొనుగోళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి అక్కడకి వెళ్లడానికి కూడా.. హైదరాబాద్‌, విశాఖపట్నం వంటి నగరాల్లో పలు ఏజెన్సీలు ఏర్పాటయ్యాయి. వారిని సంప్రదిస్తే మొత్తం పర్యటన ప్రణాళిక, ఏర్పాట్లను వారే చూసుకుంటారు. వీసా ప్రాసెసింగ్‌ నుంచి చైనాలో వసతి, భోజనం, ఫ్యాక్టరీల సందర్శన.. అన్నీ చూసుకుంటారు. మనోళ్లు అక్కడ కొనే వస్తువుల నాణ్యతను తనిఖీ చేసి, దగ్గరుండి ప్యాక్‌ చేయించి లోడ్‌ చేయిస్తారు. ఇందుకుగాను 5-8శాతం సర్వీస్‌ చార్జ్‌ తీసుకుంటారు. ఇటీవలికాలంలో చైనాకు వచ్చే తెలుగువారి సంఖ్య పెరుగుతుండడంతో.. అక్కడ తెలుగు భోజన హోటళ్లు కూడా వెలిశాయి. కొన్ని ఏజెన్సీలు ప్రత్యేకంగా తెలుగు వంటవాళ్లను నియమించుకుని షాపింగ్‌కు వచ్చే వాళ్లకు చక్కటి ఆంధ్రా భోజనాన్ని వడ్డిస్తున్నారు. అక్కడ ‘తెలుగు అసోసియేషన్‌’ కూడా బలంగా ఉంది. చైనాలో చదువుకోవడానికి(ముఖ్యంగా ఎంబీబీఎస్‌) వెళ్లిన తెలుగు విద్యార్థులు పార్ట్‌టైం జాబ్‌గా షాపింగ్‌ గైడ్‌లుగా వ్యవహరిస్తున్నారు. చైనీస్‌ భాష రావడంతో మన వాళ్ల తరఫున బేరమాడడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

    సురక్షిత రవాణా

    చైనాలో కొన్న వస్తువులను ఇంటికి చేర్చడానికి సురక్షితమైన రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంది. కొన్న వస్తువులన్నింటినీ ఒక చోట చేర్చి, వాటర్‌ ప్రూఫ్‌ ప్యాకింగ్‌ చేస్తారు. ఆ వస్తువుల పరిమాణాన్ని బట్టి 20 అడుగుల లేదా 40 అడుగుల కంటైనర్లను బుక్‌ చేస్తారు. సముద్ర మార్గం ద్వారా చైనా నుంచి విశాఖపట్నం, చెన్నై పోర్టులకు పంపుతారు. అక్కడ కస్టవ్స్‌ క్లియరెన్స్‌ తర్వాత నేరుగా ఇంటికి చేరుస్తారు. భారీ సరకుల రవాణాకు సముద్రమార్గాన్నే ఎంచుకుంటారు. ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. ఇంటికి చేరడానికి 25 రోజుల నుంచి 40 రోజులు పడుతుంది. ఇక తక్కువ బరువుండే, ఖరీదైన సరుకుల రవాణాకు విమాన మార్గం అనుకూలం. ఖర్చు ఎక్కువైనా వేగంగా వచ్చేస్తాయి. అక్కడ మనం కొన్న వస్తువులను కేవలం 5 నుంచి 10 రోజుల్లో చేరవేస్తారు. ఇంకా చిన్న వస్తువులను.. కొరియర్‌ ద్వారా పార్శిళ్ల రూపంలో పంపిస్తారు. ఇందుకు 7 నుంచి 12 రోజులు పడుతుంది.

    ఇవన్నీ చూసుకోవాలి సుమా..!

    అంతదూరం (చైనా) వెళ్లి షాపింగ్‌ చేసేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చైనా వెళ్లే ముందే ఇంటి గదులు, కిటికీలు, తలుపుల కొలతలు కచ్చితంగా నోట్‌ చేసుకోవాలి. యూరప్‌ దేశాలు క్వాలిటీ బాగోలేదని తిరస్కరించిన స్టాక్‌ను కొందరు ఏజెంట్లు తక్కువ ధర అనే ఆశ చూపి మనకు అంటగట్టే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఏజెంట్‌ ఎంపిక చాలా ముఖ్యం. అపరిచితులకు ముందే డబ్బులు చెల్లించకూడదు. పాత కస్టమర్ల రిఫరెన్స్‌ ద్వారా ఏజెంట్‌ను ఎంచుకోవాలి. ఎలకా్ట్రనిక్‌ వస్తువులు కొనేటప్పుడు వాటి స్పేర్‌ పార్ట్స్‌ దొరుకుతాయో లేదో చూసుకోవాలి. ఇంటర్నేషనల్‌ వారంటీ ఉన్న బ్రాండ్లను ఎంచుకోవడం ఉత్తమం. షోరూమ్‌లో నాణ్యమైన వస్తువు చూపించి కంటైనర్‌ లోడ్‌ చేసేటప్పుడు నాసిరకం వస్తువు పెట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే లోడింగ్‌ పర్యవేక్షణ తప్పనిసరి. చైనాలో కొన్న వస్తువులకు ఇండియాలో వారంటీ ఉండదు. కాబట్టి ఎలకా్ట్రనిక్‌ వస్తువుల కంటే నాన్‌ ఎలకా్ట్రనిక్‌ వస్తువులకే ప్రాధాన్యమివ్వాలి. టైల్స్‌, కమోడ్స్‌ వంటివి కొనేటప్పుడు షిప్పింగ్‌లో పగిలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఉడెన్‌ క్రేట్‌ ప్యాకింగ్‌ (చెక్క పెట్టెలు) చేయించుకోవాలి. టూరిస్ట్‌ వీసాపై కంటే.. బిజినెస్‌ వీసాపై వెళ్లడం సురక్షితం. కనీసం రూ.15లక్షల పైన షాపింగ్‌ ఉంటేనే చైనా వెళ్లడం లాభదాయకం. చైనాలో వస్తువు కొనేటప్పుడు అక్కడ చెల్లించే వస్తువు ధరతో పాటు ఇక్కడ పోర్టులో చెల్లించాల్సిన కస్టమ్స్‌ డ్యూటీని కూడా లెక్కల్లోకి తీసుకోవాలి. అప్పుడే బడ్జెట్‌ తలకిందులు కాకుండా ఉంటుంది.

    చౌక అనే కాదు.. క్వాలిటీ కూడా

    గతంలో కంటే ఇప్పుడు ఇంకా చైనా వచ్చి వస్తువులు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిందని, చైనాలో వస్తువులు కేవలం చౌక మాత్రమే కాకుండా వేలాది డిజైన్లు అందుబాటులో ఉంటాయని చైనాలో స్థిరపడిన హైదరాబాదీలు అప్పారావు, మూర్తి ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. ‘చైనాకు వచ్చే వాళ్లు నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయడానికి సహకరిస్తున్నాం. హోటల్స్‌, భోజనం, స్థానిక రవాణా, ఫ్యాక్టరీల సందర్శన వంటివి దగ్గరుండి చూసుకుంటున్నాం. నాణ్యత పరిశీలన నుంచి ప్యాకింగ్‌, కంటైనర్‌ లోడింగ్‌ వరకు సాయం చేస్తున్నాం’ అని తెలిపారు.

    నాణ్యమైన వస్తువులేనా?

    చైనా వస్తువులు అనగానే చాలా మందికి అవేవో చీప్‌ వస్తువులనే భావన ఉంటుంది. కానీ, ‘పిండి కొద్దీ రొట్టె’ అన్న చందంగా.. మనం ఎంచుకునే గ్రేడ్‌, పెట్టే ఖర్చు ఆధారంగా చైనీయులు మనకు ఏ స్థాయి నాణ్యత కావాలంటే అంత నాణ్యతతో వస్తువులు తయారుచేసిస్తారు. ఉదాహరణకు ఒక ప్లాస్టిక్‌ కుర్చీనే తీసుకుంటే.. అది ఎ, బి, సి అనే మూడు గ్రేడ్లలో లభిస్తుంది. ‘ఎ’ గ్రేడ్‌ అంటే అత్యున్నత నాణ్యత. ‘బి’ మధ్యస్థం. ‘సి’ గ్రేడ్‌ ఉత్పత్తులు కూడా చూడ్డానికి మెరిసిపోతాయిగానీ మన్నిక తక్కువ. మనం చీప్‌ వస్తువులనేది వీటినే. కాబట్టి, ‘ఎ’ గ్రేడు రకాన్నే ఎంచుకోవాలి. వాటికి డ్యూటీ, షిప్పింగ్‌ ఖర్చులు కూడా కలుపుకొన్నా.. ఇక్కడి కంటే తక్కువకే లభిస్తాయి. ఆ వస్తువు కంటెయినర్‌లోకి ఎక్కే ముందు.. ఏజెంట్లు లేదా థర్డ్‌పార్టీ ఇన్‌స్పెక్షన్‌ కంపెనీల ద్వారా తనిఖీ చేయించుకోవచ్చు. నాణ్యత లోపం ఉంటే.. రిఫండ్‌ లేదా రీప్లే్‌సమెంట్‌ ఒప్పందంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక.. కొత్తగా ‘వీడియో కాల్‌ షాపింగ్‌’ కూడా మొదలైంది. మీరు చైనా వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఏజెంట్‌ షోరూమ్‌లో తిరుగుతూ వీడియో కాల్‌ చేస్తారు. నచ్చిన వస్తువును అక్కడికక్కడే సెలెక్ట్‌ చేసుకోవచ్చు. అలీబాబా, అమెజాన్‌ చైనా, ట్రేడ్‌ఇండియా, కనెక్ట్‌2ఇండియా వంటి బీ2బీ (బిజినెస్‌ టు బిజినెస్‌) వంటి పోర్టల్స్‌ ద్వారా ఇక్కడి నుంచే ఆర్డర్‌ చేయవచ్చు. అయితే.. ఆన్‌లైన్‌లో కనిపించే రంగు, ఫినిషింగ్‌ నేరుగా చూసినప్పుడు ఉండకపోవచ్చు. అలాగే, షిప్పింగ్‌ ఛార్జీలు మొదట తక్కువ చెప్పి, వస్తువు పోర్టుకు వచ్చాక రకరకాల ఫీజుల పేరుతో ఎక్కువ వసూళ్లు చేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త.

    ఎక్కడెక్కడ ఏవి ఫేమస్సంటే..

    చైనాలోని గ్వాంగ్‌ఝౌ నగరం.. ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తులకు, మొబైల్‌, దుస్తులు, ఫ్యాషన్‌ వస్తువులకు ప్రధాన హబ్‌. ప్రపంచం నలుమూలల నుంచీ వ్యాపారులు వాటిని కొనుగోలు చేయడానికి అక్కడికెళ్తారు. అలాగే.. గిఫ్ట్‌ ఐటెమ్స్‌, బొమ్మలు, స్టేషనరీ, ప్లాస్టిక్‌ వస్తువుల రాజధాని ‘యివ్వు’ నగరంలో విరివిగా లభిస్తాయి. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ర్టానిక్‌ చిప్స్‌, గాడ్జెట్లు, స్మార్ట్‌ డివైసె్‌సకు ప్రధాన కేంద్రం షెన్‌జెన్‌.

    హైదరాబాద్‌లో రూ.40లక్షలు.. చైనాలో రూ.22 లక్షలే!

    మా విల్లా కోసం ఫర్నిచర్‌ కొనాలని స్థానిక షోరూమ్‌కు వెళ్తే.. నాకు నచ్చిన ఇటాలియన్‌ మోడల్‌ సోఫా సెట్‌, డైనింగ్‌ టేబుల్‌, బెడ్స్‌, హోమ్‌ థియేటర్‌ సీటింగ్‌ అన్నీ కలిపి రూ.40లక్షల పైనే చెప్పారు. నేను నా స్నేహితుడి సలహా మేరకు చైనా వెళ్తే.. అక్కడ ఇవే వస్తువులు ఇంకా మెరుగైన ఫినిషింగ్‌తో కేవలం రూ.14 లక్షలకే దొరికాయి. షిప్పింగ్‌, కస్టమ్స్‌ డ్యూటీ, ప్రయాణ ఖర్చులతో కలిపి రూ.22లక్షల్లో పనిపూర్తయింది.

    – దుబ్బాకుల విరాజ్‌ యాదవ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, హైదరాబాద్‌

    వారం రోజుల ట్రిప్‌.. రూ.18లక్షలకే ఇల్లు మొత్తం సెట్‌

    కొత్తగా కట్టిన మా విల్లాలో ఫర్నిచర్‌, ఇంటీరియర్స్‌ కోసం రూ.25లక్షలు బడ్జెట్‌ అనుకున్నాను. కానీ, చైనాకి వెళ్తే.. రానుపోను టికెట్లు, షిప్పింగ్‌, డ్యూటీ అన్ని కలిపి రూ.18 లక్షలకే నాణ్యమైన, ఆధునిక డిజైన్ల ఫర్నిచర్‌ తెచ్చుకోగలిగాను. ఒక వారం ట్రిప్‌ ప్లాన్‌ చేసుకుంటే ఇల్లు మొత్తం సెట్‌ చేసుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.