చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’ త్వరలో భారతదేశంలో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. వివో తన ఎక్స్200 సిరీస్‌లో ‘ఎక్స్200టీ’ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే Vivo X200, Vivo X200 Pro, Vivo X200 FE వంటి మోడల్స్ మార్కెట్లో ఉండగా.. ఇప్పుడు ఈ సిరీస్‌లోకి కొత్తగా Vivo X200T 5G ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ఫోన్‌కు సంబంధించి లాంచ్‌కు ముందే స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ సపోర్ట్ ఈ డివైస్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం.
లీకైన వివరాల ప్రకారం… వివో ఎక్స్200టీలో 6.67 ఇంచెస్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 1.5K రిజల్యూషన్ ప్యానెల్‌తో రానుందని చెబుతున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ SoC ప్రాసెసర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఓఎస్‌తోనే అవుట్ ఆఫ్ ది బాక్స్ రానుంది. 5 ఏళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 7 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచెస్ అందించే అవకాశముందని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రముఖ భారతీయ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. వివో ఎక్స్200టీలో 50MP Sony LYTIA LYT-702 మెయిన్ కెమెరా (OIS సపోర్ట్‌తో) ఉండనుంది. దీనితో పాటు 50MP Samsung JN1 సెకండరీ సెన్సార్, 50MP LYT-600 థర్డ్ సెన్సార్ ఇవ్వనున్నారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇందులో 6200mAh భారీ బ్యాటరీ ఉండే అవకాశముంది. ఇది 90W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, 40W ఫాస్ట్ వైర్లెస్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుందని చెబుతున్నారు. ఈ ఫోన్‌కు IP68, IP69 రేటింగ్ ఉండే అవకాశం ఉంది. అలాగే eSIM సపోర్ట్ కూడా అందుబాటులో ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. అసలు ఫీచర్స్ ఏంటో తెలియరావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. భారతదేశంలో ఈ ఫోన్ ధర రూ.50,000 నుంచి రూ.55,000 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.


































