తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లకు పండగ వేళ ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ డియర్నెస్ అలవెన్స్ (DA) , డియర్నెస్ రిలీఫ్ (DR) పెంపుదలపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్థిక శాఖ విడుదల చేసిన G.O.Ms.No. 2 (ఉద్యోగులకు) , G.O.Ms.No. 3 (పెన్షనర్లకు) ప్రకారం, జూలై 1, 2023 నుండి అమల్లోకి వచ్చేలా ఈ అలవెన్స్‌లను సవరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా, పెరిగిన ఈ డీఏ , డీఆర్ వల్ల రాష్ట్ర ఖజానాపై ప్రతి నెలా సుమారు 227 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.
ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం, 2020 రివైజ్డ్ పే స్కేల్స్ (RPS) పొందుతున్న ఉద్యోగులు , పెన్షనర్లకు ప్రస్తుతం ఉన్న 30.03% నుండి 33.67% కి డీఏ/డీఆర్ పెరిగింది. అలాగే 2015 రివైజ్డ్ పే స్కేల్స్ పొందుతున్న వారికి ఇది 68.628% నుండి 73.344% కి సవరించబడింది. ఈ పెంపుదల కేవలం ప్రభుత్వ సిబ్బందికే కాకుండా జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీలు , ఎయిడెడ్ విదా సంస్థల బోధన, బోధనేతర సిబ్బందికి కూడా వర్తిస్తుంది. వీటితో పాటు UGC/AICTE 2016 పే స్కేల్స్ పొందుతున్న వారికి 42% నుండి 46% కి, , 2006 స్కేల్స్ వారికి 221% నుండి 230% కి పెంపు లభించింది.
చెల్లింపుల విషయానికి వస్తే, పెంచిన ఈ నూతన విధానం జనవరి 2026 నెలకు సంబంధించిన వేతనం లేదా పెన్షన్‌తో కలిపి, ఫిబ్రవరి 1, 2026న చెల్లించబడతాయి. ఉద్యోగులకు సంబంధించి, జూలై 1, 2023 నుండి డిసెంబర్ 31, 2025 వరకు ఉన్న బకాయిలను (Arrears) వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) ఖాతాల్లో జమ చేస్తారు. అయితే, 2026 ఏప్రిల్ 30లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులు , పెన్షనర్లకు ఈ బకాయిలను 30 సమాన నెలవారీ వాయిదాలలో నగదు రూపంలో చెల్లిస్తారు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమితులై CPS (Contributory Pension Scheme) పరిధిలో ఉన్న ఉద్యోగులకు బకాయిల్లో 10% మొత్తాన్ని వారి PRAN ఖాతాలకు జమ చేసి, మిగిలిన 90% మొత్తాన్ని 30 వాయిదాలలో చెల్లిస్తారు. దురదృష్టవశాత్తూ ఈ ఉత్తర్వులు వెలువడక ముందే మరణించిన ఉద్యోగుల వారసులకు బకాయిలను ఒకేసారి (Lumpsum) చెల్లిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంతో పాటు ఉద్యోగులందరికీ కోటి రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నామని, సచివాలయంలో ఉద్యోగ సంఘాల భవన నిర్మాణానికి స్థలం , నిధులు సమకూరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పారదర్శక పాలనలో ఉద్యోగులే తమ సారథులని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.


































