హైపోటోని అనే ఓ అరుదైన, ప్రమాదకరమైన కంటి వ్యాధికి వైద్యులు పరిష్కారం కనుగొన్నారు. గతంలో ఈ వ్యాధికి చికిత్స దాదాపు అసాధ్యం అనుకునేవారు.
పోయిన కంటిచూపును ఈ చికిత్స తిరిగి తెప్పించగలదని, అలాగే అంధత్వం రాకుండా అడ్డుకోగలదని వారు చెబుతున్నారు.
ప్రపంచంలోనే తొలిసారి ఈ వ్యాధికి చికిత్స అందిస్తోంది లండన్‌లోని మూర్‌ఫీల్డ్స్ హాస్పిటల్.
ఎనిమిది మందికి ఈ చికిత్స అందించగా వారిలో ఏడుగురి నుంచి సానుకూల ఫలితాలు వచ్చినట్లు అధ్యయన ఫలితాలు సూచించాయి.
ఈ చికిత్స అందుకున్న తొలి వ్యక్తుల్లో ఒకరైన నిక్కీ గయ్(47) తన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు.
ఈ ప్రయోగంలో వెలువడిన ఫలితాలు అమూల్యమైనవని నిక్కీ గయ్ అన్నారు.
”ఇవి జీవితాన్ని మార్చేసే ఫలితాలు. నేను కోల్పోయిన ప్రతిది నాకు తిరిగి వచ్చినట్లయింది. ఇప్పుడు ఎదుగుతున్న నా బిడ్డను చూసుకోగలుగుతున్నా” అని ఆమె అన్నారు.
”ప్రతీది అస్పష్టంగా చూసే దశను దాటుకుని స్పష్టంగా చూసేవైపు నా ప్రయాణం సాగింది” అని ఆమె తెలిపారు.
ప్రస్తుతం ఆమె ఐ టెస్ట్ చార్ట్‌లోని చాలా లైన్లను చదువగలుగుతున్నారు. డ్రైవింగ్‌కు అవసరమైన అర్హతలు కూడా సాధించడానికి ఆమె దగ్గరగా ఉన్నారు.
పాక్షికంగా కనిపించడం, దగ్గరగా ఉండే దాన్నేదైనా చూడాలంటే భూతద్దాన్ని పెట్టుకుని చూడడం, తన ఇంటి చుట్టూ ఉన్న వాటిని గుర్తు చేసుకుంటూ వెళ్లడం నుంచి, ఈ స్థాయి వరకు చేరడం ఓ గణనీయమైన మార్పుగా భావించవచ్చు.
“నా కంటి చూపు ఇలానే నా మిగతా జీవితమంతా ఉంటే అంతకు మించిన భాగ్యం లేదు. నేను మళ్లీ డ్రైవ్ చేయగలుగుతానని అస్సలు అనుకోలేదు. కానీ, నేను చేస్తాను” అని ఆమె అన్నారు.
హైపోటోని ఎప్పుడు వస్తుందంటే..?
హైపోటోని కారణంగా ఐబాల్(కనుగుడ్డు) లోపల ప్రెజర్ ప్రమాదకర రీతిలో తగ్గిపోతుంది. దీనివల్ల కనుగుడ్డు లోపలికి కుచించుకుపోతుంది.
గాయం లేదా వాపు తర్వాత కంటి లోపల ఉండే సహజమైన జెల్లీలాంటి ద్రవం తగినంతగా ఉత్పత్తి కాకపోతే ఇలాంటి పరిస్థితి సంభవిస్తుంది.
కొన్నిసార్లు అది కంటి సర్జరీ సైడ్ ఎఫెక్ట్ వల్ల లేదా కొన్ని ఔషధాలను వాడడం వల్ల కూడా జరుగుతుంది. దీనికి చికిత్స అందించకపోతే కళ్లు కనపించకుండాపోయే ప్రమాదం ఉంటుంది.
అంతకుముందు, కన్ను సులువుగా కదిలేందుకుగాను స్టెరాయిడ్స్, సిలికోన్ ఆయిల్‌ను వైద్యులు వినియోగించారు.
అయితే, ఇది సుదీర్ఘకాలం కొనసాగించడం మంచిదికాకపోవచ్చు. అలాగే కోల్పోయిన కంటి చూపును కూడా పూర్తిగా తిరిగి తీసుకురాలేకపోవచ్చు.
కంటి చూపుకోసం ఉపయోగపడే కంటి వెనకుండే కణాలు పని చేస్తున్నప్పుడు కూడా… సిలికోన్ ఆయిల్ గుండా చూడడం కష్టంగా ఉంటుంది. దీనివల్ల దృష్టి మసకబారుతుంది.
అయితే దీనికి పరిష్కారంగా మూర్‌ఫీల్డ్స్‌కు చెందిన నిపుణులు ఇదివరకే ఉన్న ఓ విభిన్న విధానాన్ని పాటించాలని నిర్ణయించారు. అదే చవకైన హైడ్రాక్సీప్రొపైల్ మిథైల్‌సెల్యూలోజ్(హెచ్‌పీసీఎం). ఇది పారదర్శకంగా ఉండే ఓ వాటర్-బేస్డ్ జెల్.
కొన్నిరకాల కంటి శస్త్రచికిత్సల్లో దీన్ని ఇదివరకే వినియోగించారు.
‘కాగితపు సంచి నలిగిపోయినట్లుగా…’
అయితే దీన్ని ఒక్కసారి మాత్రమే వినియోగించే పద్ధతిలా కాకుండా, మూర్‌ఫీల్డ్ బృందం దీన్ని ఓ కొత్త తరహా చికిత్సలా కంటిలోని ప్రధాన భాగంలోకి ఇంజెక్ట్ చేయాలని నిర్ణయించింది.
నిక్కీ తన కొడుకు పుట్టిన కొన్నిరోజుల తర్వాత, 2017లో కంటి చూపు సమస్యలను తొలిసారి ఎదుర్కొన్నారు. ప్రారంభంలో తన కుడి కంటిలో సిలికోన్ ఆయిల్‌ను చాలామేర అందించారు. అయితే అది సత్ఫలితాలు ఇవ్వలేదు.
హైపోటోని కారణంగా తన కన్ను సాధారణ రూపం కోల్పోయిందని, సొట్టపోయనట్లుగా లేదా నలిగిపోయిన కాగితపు సంచి మాదిరిగా మారిపోయిందని ఆమె అన్నారు. ఆ చికిత్సతో తనకు పెద్దగా ప్రయోజనం దక్కలేదని అన్నారు.
కొన్ని సంవత్సరాల తర్వాత తన ఎడమ కన్ను కూడా అదే రీతిలో ఇబ్బందికి గురి కావడం మొదలైంది.
“నా ఎడమ కంటి చూపు కూడా కోల్పోయిన తర్వాత, ఏదో ఒకటి చేయాలని అనుకున్నా” అని ఆమె అన్నారు.
‘ఈ ఫలితాలు ఊహించలేదు’
ఏదైనా కొత్తగా, అంటే పారదర్శకంగా ఉండే పదార్థాన్ని కంటిలో నింపడం వంటిది చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు నిక్కీ గయ్ కంటి వైద్యుడు హ్యారీ పెట్రుష్కిన్ అన్నారు.
“పని చేస్తుందో లేదో తెలియని ఈ తరహా చికిత్స అందించాలనుకోవడం ఒక్క కన్ను మాత్రమే ఉన్న వ్యక్తికి ప్రమాదకరంగా పరిణమించవచ్చు” అని ఆయన గుర్తు చేసుకున్నారు.
”దీన్ని మేం పరిష్కారంగా భావించి తీసుకువచ్చాం. అద్భుతంగా పని చేసింది. ఈ ఫలితాల గురించి మేం కలలో కూడా ఊహించలేదు. రెండు కళ్ల చూపును కోల్పోవాల్సిన ఓ వ్యక్తి ప్రస్తుతం మామూలుగా జీవిస్తున్నారు. ఇది నిజంగా గ్రేట్” అని హ్యారీ పెట్రుష్కిన్ చెప్పారు.
‘చాలామందికి ఉపయోగకరం’
యూకేలో ఈ తరహా చికిత్స ప్రతి ఏడాది వందల, వేలమందికి పూర్తిగా ఉపయోగపడగలదని పెట్రుష్కిన్ అన్నారు. అయితే ఆయా రోగుల్లో కంటి వెనుక భాగంలో ఉండి చూపు అందించే కణాలు సజీవంగా ఉన్నాయా లేదా అన్నదానిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
“నిక్కీ కంటిచూపు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని, తన కంటిని మళ్లీ దృఢంగా చేయగలిగితే ఆమె పరిస్థితి మెరుగుపడుతుందని మాకు తెలుసు” అని పెట్రుష్కిన్ అన్నారు.
ఇప్పటివరకు వారు 35 మంది రోగులకు ఈ చికిత్స అందించారు. ఇందుకు మూర్‌ఫీల్డ్స్ ఐ చారిటీ నిధులు అందించి సహకరించింది. ఆ ఫలితాల్లో మొదటి ఎనిమిదింటిని బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఆప్త మాలజీలో ప్రచురించారు.
ప్రతి మూడు నుంచి నాలుగు వారాలకొకసారి, సుమారు మొత్తం పది నెలలపాటు ఈ చికిత్సను అందించారు.
కొద్దిరోజుల తర్వాత ఇంతకంటే మంచి ఫలితాలు వస్తాయని పరిశోధకులు ఆశిస్తున్నారు.
“ఇదో అద్భుతమైన కథ. దీని ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే, ఇది ప్రారంభం మాత్రమే” అని పెట్రుష్కిన్ అన్నారు.




































