హైదరాబాద్ సమీపంలో మూర్ఛ (ఎపిలెప్సీ) వ్యాధికి వాడే కీలక మందులను నకిలీగా తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న ముఠాపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడులు చేశారు.
ప్రముఖ ఔషధ సంస్థ సన్ ఫార్మా లాబొరేటరీస్ లిమిటెడ్ పేరుతో నకిలీగా ముద్రించిన లెవిపిల్-500 టాబ్లెట్లు రాష్ట్రంలో విక్రయానికి పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. విశ్వసనీయ మేరకు నిర్వహించిన దాడుల్లో మెడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం, చింతల్ సుదర్శన్ రెడ్డి నగర్‌లోని దుర్గా మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ వద్ద ఈ నకిలీ మందుల నిల్వలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మందులు లెవిపిల్-500 (లెవెటిరాసెటమ్ 500 ఎంజీ) పేరిట ఉండగా, వాటిపై బ్యాచ్ నెంబర్ జీటీఎఫ్ 0885A, తయారీ తేదీ ఏప్రిల్ 2024, గడువు మార్చి 2026గా ముద్రించి, అస్సాంలోని సన్ ఫార్మా యూనిట్‌లో తయారైనవిగా తప్పుడు సమాచారం పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.
నకిలీ స్టాక్‌ను సీజ్
ఈ నకిలీ స్టాక్‌ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. మూర్ఛ వ్యాధి రోగులకు ఈ మందులు అత్యంత కీలకమైనవని, అయితే ఈ నకిలీ మందులు వాడితే వ్యాధి నియంత్రణ కాకపోవడమే కాకుండా, ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశముందని డీసీఏ హెచ్చరించింది. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఇలాంటి ముఠాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందని, నకిలీ మందుల తయారీ, సరఫరా, విక్రయంలో పాల్పడిన వారందరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మందులకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలు, నకిలీ తయారీ లేదా అనుమానాస్పద విక్రయాలపై ప్రజలు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-6969 కు ఫిర్యాదు చేయవచ్చని డీసీఏ సూచించింది.



































