ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 25 లక్షలకు పైగా కుటుంబాలు పశుపోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.
ప్రపంచ ప్రసిద్ధ ఒంగోలు గోవు, పుంగనూరు ఆవు, నెల్లూరు-మాచెర్ల గొర్రెలు, ఆశీల్ కోళ్లు వంటి మేలు జాతులకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రైతులకు, పశుపోషకులకు మరింత బలాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు.
ఈ శిబిరాలు రాష్ట్రంలోని 13,257 గ్రామాల్లో ఏర్పాటు కానున్నాయి. ప్రతి మండలంలో 2 వెటర్నరీ టీమ్లు పనిచేస్తాయి. శిబిరాల్లో పశువులకు ఉచితంగా వైద్య చికిత్సలు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు, గర్భకోశ వ్యాధుల చికిత్స, కృత్రిమ గర్భధారణ సేవలు, శాస్త్రీయ పశుపోషణపై అవగాహన కార్యక్రమాలు అందించనున్నారు. ఇవి పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, పాల ఉత్పత్తి, మాంస ఉత్పాదనను పెంచి రైతుల ఆదాయాన్ని కూడా పెంచే అవకాశం కల్పిస్తాయి.
ఇందుకు సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడలో వాల్ పోస్టర్లు, పాంప్లెట్లను ఆవిష్కరించారు. “రాష్ట్రంలో పశుసంపద సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేలు జాతి పశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ శిబిరాల ద్వారా పశుపోషకులకు మెరుగైన సేవలు అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలి” అని మంత్రి ఆదేశించారు. సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా ఈ శిబిరాలు రైతులకు మరింత ఉపయోగకరంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ప్రకారం, ఈ శిబిరాల్లో గొర్రెలు, మేకలు, పాడి ఆవులు, లేగ దూడలు, కోళ్లకు కూడా ప్రత్యేక సేవలు అందనున్నాయి. గ్రామస్థాయిలో ఏర్పాటు చేసే ఈ శిబిరాల ద్వారా పశువుల్లో సాధారణంగా వచ్చే వ్యాధులను నియంత్రించడం, గర్భధారణ సామర్థ్యాన్ని పెంచడం, పోషకాహార లోపాలను సరిదిద్దడం వంటి లక్ష్యాలు సాధ్యమవుతాయి. ఇప్పటికే అనేక జిల్లాల్లో కలెక్టర్లు పోస్టర్లను ఆవిష్కరించి, శిబిరాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రైతులు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. స్థానిక వెటర్నరీ (పశు వైద్య) ఆసుపత్రులు లేదా గ్రామ పంచాయతీలు, సచివాలయాల ద్వారా శిబిరాల సమాచారం తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పశుసంపద అభివృద్ధి మరింత వేగవంతం కానుంది. ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది.
ఈ ఉచిత శిబిరాలు పశుపోషకుల జీవితాల్లో మలుపు తిరుగుతాయనడంలో సందేహం లేదు. సంక్రాంతి సందర్భంగా రైతులకు ఇచ్చిన ఈ బహుమతి రాష్ట్ర ప్రభుత్వం రైతు హితాన్ని కాంక్షిస్తోందనడానికి నిదర్శనం.


































