బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్‌లో సరికొత్త ‘చేతక్ సీ25’ మోడల్‌ను ప్రవేశపెట్టింది. రూ. 91,399 (ఎక్స్-షోరూమ్) ధరతో లభించే ఈ స్కూటర్ రేంజ్, ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకుంటోంది. ఇందులో భాగంగా బెస్ట్ సెల్లింగ్ చేతక్ సిరీస్‌లో భాగంగా సరికొత్త ‘చేతక్ సీ25’ ఈ-స్కూటర్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 91,399గా నిర్ణయించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 35, 30 సిరీస్ మోడళ్ల కంటే ఇది తక్కువ ధరకే లభిస్తుండటం గమనార్హం.
పాత చేతక్ డిజైన్ సొబగులను కాపాడుకుంటూనే, మరింత స్లీక్ లుక్, స్పోర్టీ డీకాల్స్‌తో ఈ కొత్త స్కూటర్‌ను సంస్థ రూపొందించింది. ఈ నేపథ్యంలో ఈ బజాజ్ సీ25 ఫీచర్స్, రేంజ్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బజాజ్ చేతక్ సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్- డిజైన్, లుక్..
సరికొత్త చేతక్ సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్ తన ఐకానిక్ ‘రెట్రో’ స్టైల్‌ను కొనసాగిస్తోంది. ఇతర ప్లాస్టిక్ బాడీ స్కూటర్లలా కాకుండా, ఇది పూర్తి మెటల్ బాడీతో వస్తోంది. సిగ్నేచర్ హార్స్‌షూ గ్రాఫిక్‌తో కూడిన రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, వెనుక వైపు ఐస్-క్యూబ్ తరహా టైల్ లైట్లు దీనికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తున్నాయి. చేతక్ లోగో స్ఫూర్తితో రూపొందించిన అల్యూమినియం గ్రాబ్ హ్యాండిల్ పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.
బజాజ్ చేతక్ సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్- బ్యాటరీ, రేంజ్..
రేంజ్ విషయంలో రాజీ పడకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 2.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు.
రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐడీసీ సర్టిఫికేషన్ ప్రకారం 113 కిలోమీటర్ల రేంజ్‌ని ఈ ఈ-స్కూటర్ ఇస్తుంది.
ఛార్జింగ్: కేవలం 2 గంటల 25 నిమిషాల్లో బ్యాటరీని 0 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చు.
వేగం: గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకుపోతుంది.
బజాజ్ చేతక్ సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్- ఫీచర్లు, హార్డ్‌వేర్..
ఈ ఈ- స్కూటర్‌లో కలర్ ఎల్‌సీడీ స్పీడోమీటర్‌ను ఏర్పాటు చేశారు. ఫోన్ కాల్స్ స్వీకరించడం లేదా తిరస్కరించడం, మ్యూజిక్ కంట్రోల్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రయాణం సాఫీగా సాగడానికి ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, డిస్క్ బ్రేక్ ఉండగా.. వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌ను ఇచ్చారు. సీటు కింద 25 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇందులో ఫుల్-ఫేస్ హెల్మెట్‌ను సులభంగా ఉంచవచ్చు.
రైడింగ్ మోడ్స్: రైడర్ తన అవసరానికి తగ్గట్టుగా ఈకో, స్పోర్ట్స్ మోడ్లలో దీనిని నడపవచ్చు. పార్కింగ్ సమయంలో ఇబ్బంది కలగకుండా ‘రివర్స్ మోడ్’ను కూడా ఇందులో చేర్చారు. అలాగే ‘హిల్ హోల్డ్ అసిస్ట్’ ఫీచర్ వల్ల ఎత్తైన ప్రదేశాల్లో లేదా వంతెనలపై వెనుకకు జారిపోకుండా ప్రయాణించవచ్చు. వెనుక కూర్చున్న వ్యక్తితో కలిపి దాదాపు 19 శాతం వరకు వాలు ఉన్న ప్రదేశాలను కూడా ఇది సునాయాసంగా ఎక్కగలదని బజాజ్ పేర్కొంది.
ప్రస్తుత చేతక్ మోడళ్లతో పోలిస్తే ఇది 22 కిలోల తక్కువ బరువు (మొత్తం 108 కిలోలు) ఉండటం విశేషం. నీటి వల్ల పాడవకుండా ఐపీ67 రేటింగ్‌ను కూడా దీనికి ఇచ్చారు.
మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, తక్కువ బరువుతో, మంచి మైలేజీ ఇచ్చేలా బజాజ్ చేతక్ సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది.



































