సంక్రాంతి పండుగకు అందరూ తమ సొంత ఊర్లకు వెళ్లి ఘనంగా పండుగ జరుపుకుంటున్నారు. ఇక సంక్రాంతి పండుగకు వెళ్లేందుకే బస్సులు, రైళ్ళలో విపరీతమైన రద్దీ కనిపించింది.
ఇప్పుడు పండుగ ముగిశాక తిరుగు ప్రయాణాలు చెయ్యాలని భావిస్తున్న వారికి టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌కు తిరిగి వచ్చే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్‌ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
తిరుగు ప్రయాణాలకు ప్రత్యేక బస్సులు.. ఎన్నంటే
పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు సురక్షితంగా, సౌకర్యవంతంగా నగరానికి చేరుకునేందుకు ఇప్పుడు ఏపీతో పాటు, తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా అదనపు బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి హైదరాబాద్ వచ్చే వారి కోసం సుమారు 1200 ప్రత్యేక బస్సులు కేటాయించింది. ఈ బస్సులు రద్దీ తీవ్రతను తగ్గించి ప్రయాణికులు సులభంగా ప్రయాణం చేసేలా చేస్తాయని ఆర్టీసీ భావిస్తుంది.
ఈ ప్రాంతాల నుండి తిరుగు బస్సులు
ఈ ప్రత్యేక సర్వీసులు హైదరాబాద్‌తో పాటు సమీప ప్రాంతాలైన కోదాడ, సూర్యాపేట, నల్గొండ, మిర్యాలగూడ వంటి ప్రాంతాలకు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ వంటి సుదూర ప్రాంతాలకు ఏర్పాటు చేశారు. జనవరి 17 నుంచి పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు తిరిగి ప్రారంభం కానుండటంతో శుక్రవారం నుంచే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల తిరుగు ప్రయాణాలు మొదలు పెడతారు. అయితే, జనవరి 18 ఆదివారం ఈ రద్దీ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అధికారుల అంచనా.
ఈ రీజియన్ లలో భారీ రద్దీ
ఇప్పటికే ఖమ్మం, భద్రాచలం, కోదాడ వంటి ప్రాంతాల నుండి హైదరాబాద్ వచ్చే బస్సుల్లో రిజర్వేషన్లు దాదాపుగా పూర్తయ్యాయి. రంగారెడ్డి రీజియన్ పరిధిలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం, భీమవరం, నెల్లూరు వంటి ప్రధాన నగరాల నుండి హైదరాబాద్ చేరుకునే సాధారణ బస్సుల్లోనూ విపరీతమైన రద్దీ కొనసాగుతోంది.
ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు.. ఆర్టీసీ బస్సుల్లోనూ అదనపు చార్జీలు
సాధారణ రోజుల్లో అమలాపురం, ఒంగోలు, విజయవాడ, కర్నూలు వంటి రూట్లలో 300 బస్సులు నడుస్తాయని, సంక్రాంతి రద్దీ కోసం మరో 200 అదనపు బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ప్రయాణికులు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు భరించలేక ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నాయి. తెలంగాణా ఆర్టీసీ పండుగ ప్రత్యేక బస్సులకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ ప్రయాణికులకు చెల్లించక తప్పటం లేదు.
ప్రయాణికులకు ఆర్టీసీ అధికారుల సలహా
ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి ప్రధాన బస్టాండ్ల వద్ద ప్రత్యేక అధికారులను నియమించి రద్దీని పర్యవేక్షిస్తున్నారు.నగరంలోని ఈ కీలక బస్టాండ్లలో దిగే ప్రయాణికులు హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిటీ బస్సుల సంఖ్యను కూడా బాగా పెంచారు. తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే అవకాశం ఉందని, కాబట్టి ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అందరూ ఒకేసారి కాకుండా రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు.



































