మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.
మెగాస్టార్ మాస్ ఇమేజ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్ టైన్ మెంట్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలైన ఈ మూవీ ప్రీమియర్స్, ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ మౌత్ టాక్ తో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 84 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
సంక్రాంతి కానుకగా ఈ ఏడాది చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- డైరెక్టర్ మారుతి కాంబోలో వచ్చిన రాజాసాబ్ మూవీ జనవరి 9న విడుదలైంది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చిరంజీవి సినిమాకు జై కొడుతున్నారు. గతేడాది విక్టరీ వెంకటేశ్ తో సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. అయితే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఇక చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా టికెట్స్ మైండ్ బ్లోయింగ్ రేంజ్ లో సేల్ అవుతున్నాయి. బుక్ మై షో యాప్ ప్రకారం.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 3 లక్షల 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. మొదటి రోజు ఈ చిత్రానికి ఏకంగా 4 లక్షల 80 వేల టికెట్స్ అమ్ముడుపోగా.. ఇక రెండో రోజు 4 లక్షల 5 వేల టిక్కెట్లు, అలాగే మూడో రోజు 4 లక్షల 45 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఓవరాల్ గా కేవలం బుక్ మై షో యాప్ నుండే ఈ సినిమాకు 16 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. బుక్ మై షో కాకుండా డిస్ట్రిక్ట్ యాప్ లో ఇక ఏ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోయాయో తెలియాల్సి ఉంది. మున్ముందు ఈ మూవీ ఇంకెన్ని రికార్డ్స్ ను కొల్లగొడుతుందో చూడాలి.


































