ఏపీ టాప్ టూరిజం కారిడార్ బాపట్ల – సూర్యలంక

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో బాపట్ల చీరాల సూర్యలంక కారిడార్ తదుపరి ప్రీమియం బీచ్ టూరిజం హబ్‌గా వేగంగా అవతరిస్తోంది. విశాఖపట్నం తర్వాత పర్యాటక రంగంలో అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతంగా దీనిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఈ క్రమంలోనే ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ స్థాయి హాస్పిటాలిటీ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. సుమారు 435 కోట్ల మొత్తం వ్యయంతో మూడు ప్రతిష్టాత్మక హోటల్ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


ఈ ప్రాజెక్టుల్లో భాగంగా హిల్టన్ గ్రూప్ రూ. 183.8 కోట్లతో 124 గదులు, సెయిలింగ్ క్లబ్ , 1000 మంది సామర్థ్యం గల భారీ కన్వెన్షన్ సెంటర్‌తో కూడిన 5-స్టార్ రిసార్ట్‌ను నిర్మించనుంది. అదేవిధంగా, ఐటీసీ సంస్థ రూ. 187.5 కోట్లతో 104 గదులు, వెల్నెస్ సెంటర్, 800 మందికి సరిపడా బ్యాంక్వెట్ హాల్‌తో మరో 5-స్టార్ రిసార్ట్‌ను ఏర్పాటు చేస్తోంది. వీటితో పాటు రాయల్ ఆర్చిడ్ సంస్థ రూ. 64.4 కోట్లతో 80 గదుల సామర్థ్యం గల 3-స్టార్ రిసార్ట్‌ను నిర్మిస్తోంది.

ఈ భారీ పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా, వందలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ‘స్వదేశీ దర్శన్ 2.0’ పథకం కింద అందుతున్న నిధులతో సూర్యలంక తీరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నారు. రాజధాని అమరావతికి సమీపంలో ఉండటం , మెరుగైన రోడ్డు కనెక్టివిటీ ఉండటంతో, రానున్న రోజుల్లో ఈ కారిడార్ దక్షిణాదిలోనే కీలకమైన పర్యాటక కేంద్రంగా మారబోతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.