బంగారం, వెండి కొనాలనుకునే వారికి మరోసారి ఊరట లభించింది. కిందటి రోజుతో పోలిస్తే దేశీయంగా గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గుముఖం పట్టాయి.
చాలా రోజుల తర్వాత వరుసగా రెండో రోజు బంగారం ధరలు పడిపోవడంతో వినియోగదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. రాబోయే రోజుల్లో గ్లోబల్ అనిశ్చితి తగ్గితే ధరలు ఇంకా దిగొచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలను ఎక్కువగా ఇష్టపడతారు. పండగలు, వివాహాలు, శుభకార్యాల సమయంలో బంగారానికి భారీ డిమాండ్ ఉంటుంది. అలంకరణతో పాటు బంగారం సమాజంలో హోదాను కూడా సూచిస్తుందన్న భావన ఉంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారం సురక్షిత పెట్టుబడిగా మారింది. అలంకరణతో పాటు పెట్టుబడి సాధనంగా కూడా బంగారం, వెండిపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్లో సంక్షోభం, వెనెజువెలాలో రాజకీయ మార్పులు వంటి అంశాలు గ్లోబల్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటుండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే సంకేతాలు ఇవ్వడం వంటి కారణాలతో గతంలో గోల్డ్ ధరలు ఆల్‌టైమ్ హైకి చేరాయి. అయితే ఆ గరిష్ఠాల నుంచి ఇప్పుడు ధరలు క్రమంగా తగ్గుతున్నాయి.
హైదరాబాద్ మార్కెట్‌ను పరిశీలిస్తే, ఇవాళ 22 క్యారెట్ల (Gold rate today) బంగారం ధర తులానికి రూ.200 తగ్గి రూ.1,31,450కి చేరింది. కిందటి రోజు కూడా ఈ ధర రూ.350 తగ్గింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.220 తగ్గి రూ.1,43,400 వద్ద ట్రేడవుతోంది. దీనికి ముందు రోజు ఈ ధర రూ.380 తగ్గింది.
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గాయి. ఇవాళ కేజీ వెండి ధర రూ.4,000 తగ్గి హైదరాబాద్‌లో రూ.3,06,000 వద్ద కొనసాగుతోంది. అయితే ఇటీవల కొన్ని రోజులుగా వెండి ధరలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు రూ.42,000 పెరగడం గమనార్హం.
అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,620 డాలర్ల నుంచి తగ్గి ప్రస్తుతం 4,596.75 డాలర్ల వద్ద ఉంది. వెండి ధర ఔన్సుకు 90.13 డాలర్ల స్థాయిలో కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ రూ.90.81 వద్ద స్థిరంగా ఉంది.



































