సమ్మర్ వచ్చేస్తోంది.. ఈ టిప్స్ పాటించండి

ఫిబ్రవరి నెల ఇంకా ప్రారంభం కాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రస్తుతం వాతావరణంలో విచిత్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో చలి వణికిస్తుంటే, ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు ఎండలు దంచికొడుతున్నాయి.


శీతాకాలం ముగిసి వేసవి కాలం మొదలయ్యే ఈ సంధి కాలంలో (Seasonal Transition) మన శరీరం వాతావరణ మార్పులకు త్వరగా ప్రభావితమవుతుంది. ఫలితంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1. పెరుగుతున్న అలెర్జీలు : శీతాకాలం నుండి వేసవికి మారే క్రమంలో గాలిలో పుప్పొడి (Pollen) స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. దీనివల్ల చాలా మందిలో అలెర్జీ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా.. నిరంతరాయంగా తుమ్ములు రావడం. ముక్కు దిబ్బడ వేయడం లేదా ముక్కు నుండి నీరు కారడం. కళ్లు ఎర్రబడటం , దురద పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ధూళికి దూరంగా ఉండటం, బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం మేలు.

2. డీహైడ్రేషన్ ముప్పు: వేసవి ప్రభావం మొదలవ్వడంతో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల చెమట ఎక్కువగా పట్టి శరీరంలోని నీటి శాతం, లవణాలు తగ్గిపోతాయి. దీనినే డీహైడ్రేషన్ అంటారు. తీవ్రమైన నీరసం, కళ్లు తిరగడం, నోరు ఎండిపోవడం, వాంతులు , విరేచనాలు. డీహైడ్రేషన్‌ను నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు. కాబట్టి దాహం వేయకపోయినా తరచుగా నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.

3. వడదెబ్బ , చర్మ సమస్యలు: ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఆరుబయట తిరిగే వారు వడదెబ్బకు (Heat Stroke) గురయ్యే అవకాశం ఉంది. భానుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై దద్దుర్లు, అలెర్జీలు రావచ్చు. దీర్ఘకాలం ఎండలో గడపడం వల్ల చర్మ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. చర్మం త్వరగా ముడతలు పడి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు వాడటం లేదా సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవడం ఉత్తమం.

4. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు : ఉష్ణోగ్రతల్లో వచ్చే హెచ్చుతగ్గులు వైరస్‌లు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గి శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు దరిచేరుతాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్ సమస్యలు ఈ కాలంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. పరిసరాల పరిశుభ్రత పాటించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం , పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందవచ్చు.

వాతావరణం మారుతున్నప్పుడు మన శరీరం దానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలో జ్వరం, అలెర్జీ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటే వేసవిని ఆరోగ్యంగా ఎదుర్కోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.