డయాబెటిస్‌ను మొదట్లోనే కట్టడి చేస్తే.. గుండెపోటు ముప్పు 60% మాయం, నిపుణుల సూచనలు

డయాబెటిస్‌ను తొలి దశలోనే నియంత్రించడం ద్వారా గుండె జబ్బుల ముప్పును 50-60% వరకు తగ్గించవచ్చని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రియా పాలింకర్ తెలిపారు. రక్తంలో చక్కెర స్థాయిలు గుండెను ఎలా దెబ్బతీస్తాయో, ‘మెటబాలిక్ మెమరీ’ ప్రాధాన్యతను ఆమె వివరించారు.

చాలామంది గుండె ఆరోగ్యం అనగానే కేవలం వ్యాయామం, కొలెస్ట్రాల్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ, రక్తంలో చక్కెర స్థాయిలు (Blood Sugar) గుండెకు ‘నిశ్శబ్ద శత్రువు’లా మారుతాయని మనకు తెలియదు. మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ కాకముందే.. పెరిగిన చక్కెర స్థాయిలు గుండె ధమనులను దెబ్బతీయడం ప్రారంభిస్తాయి. అయితే, ప్రాథమిక దశలోనే జాగ్రత్త పడితే ఈ ప్రమాదాన్ని పూర్తిగా తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.


50-60% ముప్పును తగ్గించుకోవచ్చు

డయాబెటిస్‌ను ప్రారంభంలోనే నియంత్రించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూణేలోని సహ్యాద్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రియా పాలింకర్ కీలక విషయాలను పంచుకున్నారు.

“మధుమేహం వచ్చిన కొత్తలో, ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ అయిన మొదటి కొన్ని ఏళ్లలోనే దానిని క్రమబద్ధంగా అదుపులో ఉంచుకోగలిగితే.. భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశాలను 50 నుండి 60 శాతం వరకు తగ్గించవచ్చు” అని ఆమె పేర్కొన్నారు.

రక్తంలో చక్కెర స్థాయిలు నిరంతరం ఎక్కువగా ఉండటం వల్ల రక్త నాళాల లోపలి పొరలు దెబ్బతింటాయి. దీనివల్ల ధమనుల్లో వాపు (Inflammation) ఏర్పడి, కొవ్వు పేరుకుపోతుంది (Plaque formation). ఫలితంగా గుండెపోటు, స్ట్రోక్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయని ఆమె వివరించారు.

‘మెటబాలిక్ మెమరీ’ అంటే తెలుసా?

వైద్య పరిభాషలో దీనిని ‘మెటబాలిక్ మెమరీ’ (Metabolic Memory) అంటారు. అంటే, వ్యాధి ప్రారంభంలో మనం తీసుకునే జాగ్రత్తలు, మెరుగైన రక్త చక్కెర స్థాయిలు మన శరీరానికి ఒక ‘మంచి జ్ఞాపకం’లా ఉండిపోతాయి. దీనివల్ల జీవితాంతం గుండెకు రక్షణ లభిస్తుంది. అదే సమయంలో నిర్లక్ష్యం చేస్తే.. అది రక్తపోటును పెంచి, గుండె లయ తప్పేలా (Arrhythmia) చేసి ప్రాణాపాయానికి దారితీస్తుంది.

జీవనశైలితోనే సాధ్యం..

మందులతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ప్రాణప్రదమని డాక్టర్ ప్రియా సూచిస్తున్నారు.

సమతుల్య ఆహారం: సరైన మోతాదులో పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.

క్రమం తప్పని వ్యాయామం: శారీరక శ్రమ గుండెకు బలాన్నిస్తుంది.

ఒత్తిడి తగ్గించుకోవడం: తగినంత నిద్ర, ప్రశాంతత రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి.

దురలవాట్లకు దూరం: ధూమపానం, మద్యం పూర్తిగా మానేయడం శ్రేయస్కరం.

“డయాబెటిస్ ఉన్నంత మాత్రాన చురుకైన జీవనశైలికి దూరం కావాల్సిన అవసరం లేదు. ఒలింపిక్ స్విమ్మర్ గ్యారీ హాల్ జూనియర్, రోయింగ్ ఛాంపియన్ సర్ స్టీవ్ రెడ్‌గ్రేవ్ వంటి వారు మధుమేహాన్ని జయించి క్రీడల్లో రాణించడమే దీనికి నిదర్శనం” అని ఆమె ఉదాహరించారు.

హెచ్చరిక సంకేతాలను గుర్తించండి

మీకు డయాబెటిస్ ఉంటే.. ఒకవేళ మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించినా సరే, క్రమం తప్పకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా..

  • అకస్మాత్తుగా నీరసం రావడం.
  • ఆయాసం అనిపించడం.
  • వ్యాయామం చేసే సామర్థ్యం తగ్గడం.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా దీర్ఘకాలిక గుండె ముప్పును తప్పించుకోవచ్చు.

(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా నిపుణులైన వైద్యులను సంప్రదించి సలహాలు పొందాలి.)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.