ప్రపంచ రత్నాల చరిత్రలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. శ్రీలంక రాజధాని కొలంబోలో ప్రపంచంలోనే అతిపెద్ద నీలమణి వజ్రాన్ని ఇటీవల ప్రజల ముందుకు తీసుకొచ్చారు.
ఊదా వర్ణంలో మెరిసే ఈ అద్భుతమైన రత్నం పేరు ‘పర్పుల్ స్టార్’. దీని బరువు 3,563 క్యారెట్లు. ఇదే ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద నీలమణి రాయి కావడం విశేషం.
వజ్రం కంటే ఎక్కువ మెరుపు, ఆకర్షణ కలిగిన ఈ నక్షత్ర నీలమణి త్వరలోనే వేలానికి రానుంది. యజమానులు దీని విలువను సుమారు 300 మిలియన్ డాలర్లుగా (భారత కరెన్సీలో సుమారు రూ. 2,728 కోట్లు)గా నిర్ణయించారు.
ఈ అరుదైన నీలమణిని ‘స్టార్ ఆఫ్ ప్యూర్ ల్యాండ్’ అనే పేరుతో కూడా పిలుస్తారు. ప్రముఖ రత్నాల నిపుణుడు ఆశాన్ అమరసింఘే మాట్లాడుతూ.. “ఇది చరిత్రలో ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద ఊదా నక్షత్ర నీలమణి. ఇది నక్షత్రంలా కనిపిస్తూ, ఏడు విభిన్న రంగుల కిరణాలను వెలువరిస్తుంది. ఇతర రత్నాలకంటే ఇది పూర్తిగా భిన్నమైన ప్రత్యేకతను కలిగి ఉంది” అని తెలిపారు.
2023లో లభించిన అపురూప రత్నం
ఈ విలువైన రత్నానికి సంబంధించిన యజమానులు తమ గుర్తింపును బహిర్గతం చేయలేదు. భద్రతాపరమైన కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. అయితే యజమానుల్లో ఒకరి ప్రకారం.. 2023లో ఈ నీలమణి వారి చేతికి వచ్చింది.
శ్రీలంకలోని ‘రత్నపుర’ ప్రాంతాన్ని ‘రత్నాల నగరం’గా పిలుస్తారు. అక్కడ జరిగిన తవ్వకాల సమయంలో ఈ రాయి బయటపడింది. అప్పట్లో ఇతర రత్నాలతో పాటు దీన్నీ కొనుగోలు చేశారు. దాదాపు రెండేళ్లపాటు అలాగే ఉంచిన తర్వాత, గత సంవత్సరం దీనిని ధ్రువీకరణ కోసం ప్రయోగశాలకు పంపారు.
రూ.కోట్లలో ధర
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. ఈ నీలమణి విలువ 300 నుంచి 400 మిలియన్ డాలర్లు (రూ.2,728 – 3,638 కోట్లు) వరకు ఉండొచ్చని ఆశాన్ అమరసింఘే వెల్లడించారు. ప్రపంచ రత్నాల మార్కెట్‌లో ఈ ‘పర్పుల్ స్టార్’ త్వరలోనే కొత్త చరిత్ర సృష్టించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.































