రెండేండ్లల్లో 1.48లక్షల మంది ఔట్‌.. సర్కారు బడుల్లో తగ్గుతున్న విద్యార్థులు.

విద్యారంగంలో మన రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెడతాం’ ఇవి పలు సందర్భాల్లో సీఎం రేవంత్‌రెడ్డి అన్న మా టలు. సాక్షాత్తు సీఎం విద్యాశాఖ మంత్రిగా ఉండగా రాష్ట్రంలోని సర్కార్‌ స్కూళ్లు రోజురోజుకు నిర్వీర్యమవుతున్నాయి. విద్యార్థులను ఆకట్టుకోలేకపోతున్నాయి. విద్యార్థులను చే ర్చుకోవడంలో విఫలం అవుతున్నాయి. రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండగా సర్కార్‌ బడుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ దారుణంగా పడిపోయింది. ఈ రెండేండ్ల కాలంలో ఏకంగా 1,48,924 మంది విద్యార్థులు సర్కార్‌ బడుల్లో తగ్గారు. 2023-24 విద్యాసంవత్సరంలో 18.06లక్షల మంది విద్యార్థులు ఉంటే, ఈ విద్యాసంవత్సరానికి వచ్చేసరికి 16.57 లక్షలకు పడిపోయింది.


గత విద్యాసంవత్సరంలో లక్షకు పైగా తగ్గగా, ఈ విద్యాసంవత్సరంలో 20వేల మంది సర్కార్‌ స్కూళ్లకు దూరమయ్యారు. సర్కార్‌ బడుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గుతుండగా, ప్రైవేట్‌ స్కూళ్లల్లో ఎన్‌రోల్‌మెంట్‌ అమాంతం పెరిగింది. ఈ విద్యాసంవత్సరంలో 11వేలకు పైగా ప్రైవేట్‌ బడులుంటే ఎన్‌రోల్‌మెంట్‌ 37 లక్షలు ఉంది. 2023- 24 విద్యాసంవత్సరంలో 30.58లక్షల మంది విద్యార్థులు మాత్రమే ప్రైవేట్‌ స్కూళ్లల్లో చదివేవారు. ఏడాది తిరిగే వరకు 2024-25 విద్యాసంవత్సరంలో ఈ ఎన్‌రోల్‌మెంట్‌ ఏకంగా 36.80లక్షలకు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే ఐదు లక్షలు పెరిగింది. ఈ విద్యాసంవత్సరానికి వచ్చే సరికి 37.04 లక్షలకు చేరింది. అంటే లక్ష పెరిగింది. ఈ రెండేండ్ల కాలంలో ప్రైవేట్‌ బడుల్లో ఆరు లక్షలు పెరిగింది. ఒకవైపు సర్కార్‌ బడుల్లో ఉన్న వారు ప్రైవేట్‌ వైపు చూస్తుండగా, పుట్టే పిల్లల్లో అత్యధికులు ప్రైవేట్‌ బడుల్లోనే చేరుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.