ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం వాహనాల రద్దీ కొనసాగింది.
సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు సోమవారం పెద్ద సంఖ్యలో హైదరాబాద్ బాట పట్టారు. కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాల్లో పెద్దసంఖ్యలో బయలుదేరడంతో రాష్ట్ర సరిహద్దు కోదాడ నుంచి చౌటుప్పల్ వరకు వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాతీయ రహదారి పొడవునా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా మీదుగా 12 వేల వాహనాల రాకపోకలు సాగాయి.
చిట్యాల పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో కొన్ని వాహనాలను భువనగిరి మీదుగా హైదరాబాద్‌కు మళ్లించారు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద 16 గేట్లకు గాను 12 గేట్ల నుంచి వాహనాలను హైదరాబాద్ వైపు అనుమతించారు. మూడు సెకన్లకు ఒక వాహనం టోల్ కౌంటర్ దాటడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తలేదు. సాధారణ రోజుల్లో 35 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా సోమవారం 65 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించాయి. అందులో 80 శాతం వాహనాలు హైదరాబాద్ వైపు పయనమయ్యాయి. జాతీయ రహదారిపై ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన వాహనాల తాకిడి రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది.































