చైనాలో జననాల రేటు వరుసగా నాలుగో ఏడాది కూడా తగ్గింది.
ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ప్రకటించినప్పటికీ, 2025లో జననాల రేటు కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
సోమవారం వెలువడిన ప్రభుత్వ డేటా ప్రకారం ఆ దేశ జననాల రేటు 1,000 మందికి 5.63కి పడిపోయింది.
ఇది 1949లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రికార్డు స్థాయిలో కనిష్ఠం. అయితే చైనాలో మరణాల రేటు 1,000కి 8.04కి పెరిగింది, ఇది1968 తర్వాత అత్యధికం.
2025 చివరి నాటికి చైనా జనాభా 3.39 మిలియన్లు తగ్గి 1.4 బిలియన్లకు చేరుకుంది.
వృద్ధుల సంఖ్య పెరగడం, ఆర్థిక వృద్ధి మందగించడం వల్ల బీజింగ్ ప్రభుత్వం.. యువత పెళ్లి చేసుకుని పిల్లలు కనాలని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది.
2016లో, చాలా కాలంగా ఉన్న వన్ చైల్డ్ విధానాన్ని రద్దు చేసిన చైనా, దాని స్థానంలో ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రవేశపెట్టింది. అయినప్పటికీ జననాల రేటు పెరగకపోవడంతో, అధికారులు 2021లో ఒక జంట ముగ్గురు పిల్లలు కనేందుకు అనుమతిస్తామని ప్రకటించారు.
మూడేళ్ల కంటే తక్కువ వయసు గల చిన్నారుల తల్లిదండ్రులకు చైనా ప్రభుత్వం 3,600 యువాన్లు(సుమారు రూ. 46,000) ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తోంది. కొన్ని ప్రావిన్సులు అదనపు నగదు ప్రోత్సాహకాలు, ఎక్కువ ప్రసూతి సెలవులు కూడా ఇస్తున్నాయి.
ఈ ప్రోత్సాహకాలలో కొన్ని వివాదాలకు దారి తీశాయి.
ఉదాహరణకు.. కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు, పరికరాలపై 13% కొత్త పన్ను విధించడంతో అనుకోని గర్భధారణలు, హెచ్ఐవీ కేసులు పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్న దేశాలలో చైనా ఒకటి.
ఆసియాలోని దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్ వంటి ఇతర దేశాలూ తక్కువ సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి.
పిల్లలను పెంచడం అత్యంత ఖరీదైన దేశాలలో చైనా కూడా ఒకటని బీజింగ్‌లోని యువా పాపులేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2024 నివేదిక పేర్కొంది.
తమ పిల్లల గురించి నిరంతరం ఆందోళన చెందకుండా.. సులభమైన, స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడపాలనే కోరిక సహా ఇతర అంశాలు కూడా జననాల రేటు తగ్గడానికి కారణమని కొంతమంది చైనీయులు బీబీసీతో చెప్పారు.
“నా స్నేహితుల్లో పిల్లలు ఉన్నవారు చాలా తక్కువ. పిల్లలున్నవారు మంచి ఆయాని కుదుర్చుకోవడంలో, పిల్లలను మంచి స్కూల్లో చేర్పించంలోనే నిమగ్నమై ఉంటారు. ఇది చాలా ప్రయాసతో కూడుకున్న పని” అని బీజింగ్ నివాసి ఒకరు 2021లో బీబీసీకి చెప్పారు.
చైనా జనాభా తగ్గుముఖం పడుతూనే ఉంటుందని ఐక్యరాజ్యసమితి నిపుణులు అంచనా వేస్తున్నారు. 2100 నాటికి ఆ దేశం ప్రస్తుత జనాభాలో సగానికి పైగా కోల్పోతుందని అంచనా వేస్తున్నారు.
తగ్గుతున్న జనాభా ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక, సామాజిక ప్రభావం చూపుతుంది. ఇప్పటికే శ్రామిక శక్తి తగ్గిపోయింది. దీంతో డబ్బు ఖర్చు పెట్టడం కూడా తగ్గిపోతుంది.
చాలా మంది యువకులు తమ తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటున్నందున, తమను తాము చూసుకోవాల్సిన లేదా ప్రభుత్వ చెల్లింపులపై ఆధారపడాల్సిన వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది.
అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రకారం.. పెన్షన్ ఫండ్ క్షీణిస్తోంది.. పెరుగుతున్న వృద్ధుల జనాభా సంక్షేమానికి తగినంత నిధులను సృష్టించడానికి చైనా వద్ద తగిన సమయంలేదు.


































