91 వేలకోట్ల పెట్టుబడి..లక్ష ఉద్యోగాలు

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. దాదాపు 91,000 కోట్ల రూపాయల పెట్టుబడితో లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆర్‌ఎంజెడ్‌ ముందుకొచ్చింది.


ముందుకొచ్చిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆర్‌ఎంజెడ్‌

  • విశాఖ, రాయలసీమలో డిజిటల్‌ ఇన్‌ఫ్రా ఇండస్ట్రియల్‌, లాజిస్టిక్స్‌ పార్కుల ఏర్పాటు
  • దావో్‌సలో ఏపీ సర్కారు, ఆర్‌ఎంజెడ్‌ ప్రకటన
  • సదస్సులో సీఎం చంద్రబాబు కీలక భేటీలు
  • ఐబీఎం చైర్మన్‌ అర్వింద్‌ కృష్ణతో సమావేశం
  • క్వాంటమ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు వినతి
  • ఫుడ్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ ఓకే
  • ఆ దేశ ఆర్థిక మంత్రితో ముఖ్యమంత్రి భేటీ
  • గూగుల్‌ క్లౌడ్‌ సీఈవోతోనూ సమావేశం
  • విశాఖలో ఏఐ డేటా సెంటర్‌ నిర్మాణంపై చర్చ
  • రామ్మోహన్‌ నాయుడు, లోకేశ్‌, భరత్‌ హాజరు
  • రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. దాదాపు 91,000 కోట్ల రూపాయల పెట్టుబడితో లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆర్‌ఎంజెడ్‌ ముందుకొచ్చింది. దావోస్‌ ఆర్థిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్‌ఎంజెడ్‌ ఈ విషయాన్ని ప్రకటించాయి. డిజిటల్‌ ఇన్‌ఫ్రా, ఇండస్ట్రియల్‌, లాజిస్టిక్స్‌ పార్కుల ఏర్పాటుకు ఆర్‌ఎంజెడ్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. దావోస్‌ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. సీఎం చంద్రబాబుతో ఐబీఎం చైర్మన్‌, సీఈవో అర్వింద్‌ కృష్ణ సమావేశమయ్యారు. అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్రంలో క్వాంటమ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ నెలకొల్పాలని ఈ సందర్భంగా ఐబీఎం చైర్మన్‌ను చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో పది లక్షల మంది యువతకు ఐబీఎం శిక్షణ ఇవ్వాలని ఈ సమావేశంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కోరారు. దేశవ్యాప్తంగా 50 లక్షల మంది యువతకు ఏఐలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా అర్వింద్‌ వెల్లడించారు. రాష్ట్ర ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. విశాఖ ఏఐ డేటా సెంటర్‌ నిర్మాణంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని ఈ సందర్భంగా కురియన్‌కు చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు లోకేశ్‌, టీజీ భరత్‌ పాల్గొన్నారు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.