ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు.. రెండోసారి

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఫిబ్రవరి 1 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఆ రోజున భూముల మార్కెట్ విలువ పెరగబోతోంది. భూములు అమ్ముకోవాలి అనుకునేవారు..


ఇప్పుడు అమ్మకుండా.. ఆగిపోతున్నారు. మరో 10 రోజులు అయితే.. తమ భూములకు భారీ విలువ వస్తుంది అని వారు ఎదురుచూస్తున్నారు. మరోవైపు భూమి కొనాలి అనుకునేవారు ఇప్పుడే కొనుక్కోవాలి అని త్వరపడుతున్నారు. ఇలా ఏపీలో రియల్ ఎస్టేట్ మార్కెట్.. రెండు భిన్నమైన అంశాలతో ఊగిసలాడుతోంది. ఐతే.. ఫిబ్రవరి 1 రాగానే ఒక్కసారిగా భూముల అమ్మకాలు పెరిగే ఛాన్స్ ఉంది.

ఫిబ్రవరి ఒకటి నుంచి ఏపీలో భూముల ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మెమో జారీ చేశారు. కాబట్టి.. ఇక అధికారికంగానే ధరలు పెరగబోతున్నాయని తేలిపోయింది. ఐతే.. కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఇది రెండోసారి పెంపు. ఇదివరకు ఓసారి పెంచితే.. ప్రజలు స్వాగతించారు. ఇప్పుడు మళ్లీ అదే మార్పు రాబోతోంది. ఈసారి పెంపు 7 నుంచి 8 సాతం ఉండొచ్చనే అంచనా ఉంది.

2025లో ప్రభుత్వం తమ సర్కార్ వచ్చాక.. రియల్ ఎస్టేట్ జోరు పెరిగిందనీ, భూములకు విలువ పెరిగిందని చెబుతూ.. మార్కెట్ విలువను 15 శాతానికి పైగా పెంచింది. దాంతో.. భూములు అమ్మేవారూ, కొనేవారూ.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వచ్చింది. భూముల విలువ పెరిగింది కాబట్టి.. ప్రజలు స్టాంప్ డ్యూటీ ఎక్కువ చెల్లించేందుకు వెనకాడలేదు. ఇలా ప్రభుత్వం రెవెన్యూని పెంచుకుంది. ఇప్పుడు మరోసారి అదే చెయ్యబోతోంది.

ప్రజలపై ప్రభావం:
తెలంగాణలో కోకాపేట లాంటి ప్రాంతాల్లో ఎకరం 100 కోట్లకు పైగా పలుకుతోంది. మరి అలాంటప్పుడు.. ఏపీలో కూడా భూములకు విలువ పెరగాలి కదా అని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా అదే దిశలో నిర్ణయాలు తీసుకుంటుండటం వల్ల.. రియల్ ఎస్టేట్ జోరు పెరగనుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక.. పెట్టుబడులను ఆహ్వానిస్తూ.. భూముల వాడకాన్ని పెంచుతోంది. అదే సమయంలో.. పేదలకు భారం కాకుండా.. ఇళ్ల నిర్మాణం కూడా చేపడుతోంది. ఉగాది నాడు లక్షల ఇళ్లను ఒకేసారి ప్రారంభించే ప్లాన్ ఉంది. తద్వారా పేదలకు ఇబ్బంది ఉండదని పాలకులు భావిస్తున్నారు.

ప్రతీ సంవత్సరం పెంపు ఉంటుందా?
గతేడాది ఫిబ్రవరి 1న భూముల విలువ పెరిగింది. మళ్లీ సరిగ్గా.. సంవత్సరం తర్వాతే ప్రభుత్వం భూముల విలువను పెంచుతోంది. ఇలా ప్రతీ సంవత్సరం చేస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఐతే.. గతంలో భూముల ధరలను ప్రభుత్వం సవరించింది. తద్వారా కొన్నిచోట్ల అత్యధిక ధర ఉన్న భూముల ధరను తగ్గించింది. అలాగే అతి తక్కువ ధర ఉన్న భూముల ధరలను పెంచింది. ఇప్పుడు కూడా అలాంటి సవరణే చెయ్యబోతోంది. ఐతే.. ఈసారి సవరణలో ఎక్కువగా పెంపు ఉండబోతోందని సమాచారం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.