బంగారం, వెండి అమ్మే ముందు కాస్త ఆగండి

భారతదేశంలో తరతరాల నుంచి బంగారం, వెండి కొనుగోలు అనేది సంప్రదాయంగా మారింది. పండగలకు, పెళ్లిళ్లకు పసిడి కొనుగోలు అనేది ఇండియన్లకు అలవాటుగా మారిందని చెప్పవచ్చు.


అది ఆర్థికంగా అత్యవసర సమయంలో ఉపయోగపడే ఆస్తి కావడంతో బంగారం కొనుగోలు అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో చాలా మంది పెట్టుబడిదారులు ధరలు పెరగగానే పసిడి అమ్మి లాభం పొందాలని చాలామంది భావిస్తుంటారు.

అయితే ఆ లాభం గురించి చాలామంది పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది పూర్తిగా మన చేతిలోకి వస్తుందా లేదా అనేది.. మనం ఎప్పుడు అమ్ముతున్నామన్న ఎగ్జిట్ టైమింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. సరైన సమయం తెలియకుండా బంగారం లేదా వెండి అమ్మితే, మీరు సంపాదించిన లాభంలో గణనీయమైన భాగం పన్నుల రూపంలో పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మొత్తం పన్ను భారం 18.2 శాతం వరకు చేరవచ్చు.

భారత ఆదాయపన్ను నిబంధనల ప్రకారం.. బంగారం లేదా వెండి అమ్మినప్పుడు వచ్చే లాభాన్ని క్యాపిటల్ గెయిన్స్ గా పరిగణిస్తారు. ఈ లాభం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, రెండోది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. మీరు ఆ ఆస్తిని ఎంతకాలం పట్టుకున్నారన్నదే ఇందులో కీలకం. భౌతిక బంగారం, వెండి లేదా డిజిటల్ గోల్డ్ వంటి వాటిని 24 నెలల కన్నా తక్కువ కాలం ఉంచి అమ్మితే.. అది షార్ట్ టర్మ్ గెయిన్స్‌గా పరిగణించబడుతుంది. అప్పుడు ఆ లాభంపై మీ ఆదాయానికి వర్తించే ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. మీరు 30 శాతం ట్యాక్స్ స్లాబ్‌లో ఉంటే, సెస్ కలిపి దాదాపు 31.2 శాతం వరకు పన్ను పడుతుంది.

అదే 24 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచి అమ్మితే.. అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. ఈ సందర్భంలో పన్ను రేటు తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ లాభంపై 12.5 శాతం పన్ను ఉండగా.. దానికి 4 శాతం సెస్ కలిస్తే మొత్తం సుమారు 13 శాతం మాత్రమే అవుతుంది. ఇక్కడే చాలా మంది ఇన్వెస్టర్లు చేసే పొరపాటు ఏమిటంటే.. కొద్దిరోజులు ఆగితే తక్కువ పన్ను పడే అవకాశం ఉన్నా, తొందరపడి అమ్మేయడం లాంటివి చేయడం. అలా చేస్తే లాభంలో పెద్ద మొత్తాన్ని పన్నుగా కోల్పోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ మధ్య తేడా వల్ల అదనంగా దాదాపు 18 శాతం వరకు పన్ను భారం పెరగవచ్చు.

గోల్డ్ లేదా సిల్వర్ ETFల విషయంలో కూడా ఇదే తరహా నిబంధనలు ఉంటాయి. అయితే ఇక్కడ హోల్డింగ్ పీరియడ్ 12 నెలలు మాత్రమే. ఒక సంవత్సరం లోపు అమ్మితే షార్ట్ టర్మ్ గెయిన్స్, ఏడాది దాటితే లాంగ్ టర్మ్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. అందుకే ETF ఇన్వెస్టర్లు కూడా ఎగ్జిట్ టైమింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సార్వభౌమ గోల్డ్ బాండ్లు (Sovereign Gold Bonds) మాత్రం కొంత ప్రత్యేకం. ఇవి ఎనిమిదేళ్ల పాటు పట్టుకుని మెచ్యూరిటీకి అమ్మితే.. లాభంపై పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. ఇది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు పెద్ద లాభం. అయితే మధ్యలో అమ్మితే మాత్రం సాధారణ క్యాపిటల్ గెయిన్స్ నిబంధనలు వర్తిస్తాయి. అంతేకాదు, ఈ బాండ్లపై వచ్చే వార్షిక వడ్డీపై మాత్రం మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారమే పన్ను చెల్లించాలి.

క్లుప్తంగా చెప్పాలంటే.. బంగారం లేదా వెండి పెట్టుబడుల్లో లాభం ఎంత వచ్చిందన్నది మాత్రమే కాదు, ఆ లాభాన్ని మీరు ఎప్పుడు బుక్ చేస్తున్నారన్నది చాలా కీలకం. ఒక చిన్న టైమింగ్ తప్పిదం కూడా మీ చేతికి వచ్చే నికర లాభాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కాబట్టి అమ్మే ముందు హోల్డింగ్ పీరియడ్, వర్తించే పన్ను రేట్లు, మీ ఆదాయ స్లాబ్ వంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటేనే లాభాలతో బయటపడతారని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.