బరువు తగ్గాలనుకునే వారు నిరంతరం వినే పదం ‘క్యాలరీ డెఫిసిట్’ (Calorie Deficit). అసలు దీని అర్థం ఏమిటి? ఆకలితో మాడాలా? లేక తక్కువ తినాలా? ఒక కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈ అంశాలపై కొందరు ఫిట్నెస్ నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడం అనేది ఒక మ్యాజిక్ కాదు. మన శరీరం రోజూ శ్వాస తీసుకోవడం, నడవడం, జీర్ణక్రియ వంటి పనుల కోసం కొంత శక్తిని (క్యాలరీలను) ఖర్చు చేస్తుంది. ఈ క్యాలరీల కంటే తక్కువగా ఆహారం తీసుకోవడాన్నే ‘క్యాలరీ డెఫిసిట్’ అంటారు.
ఒక కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది?
సాధారణంగా ఒక కిలో కొవ్వు కరగాలంటే శరీరంలో సుమారు 7,700 క్యాలరీల లోటు (Deficit) ఏర్పడాలి. మీరు రోజుకు 500 క్యాలరీలు తక్కువగా తీసుకుంటే, దాదాపు 15 నుండి 16 రోజుల్లో ఒక కిలో కొవ్వు తగ్గుతారు.
వ్యాయామం + డైట్: కేవలం ఆహారం తగ్గించడమే కాకుండా, వ్యాయామం కూడా తోడైతే ఫలితం ఇంకా వేగంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఉదాహరణకు, 300 క్యాలరీలు తక్కువగా తిని, మరో 200 క్యాలరీలు నడక ద్వారా ఖర్చు చేస్తే శరీరం మరింత ధృడంగా మారుతుంది.
ఆకలితో ఉండటం క్యాలరీ డెఫిసిట్ కాదు!
ఫిట్నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, చాలామంది చేసే తప్పు ఏంటంటే అస్సలు తినకుండా ఉండటం. మీ శరీరం రోజుకు 2000 క్యాలరీలు ఖర్చు చేస్తుంటే, మీరు 1500 నుండి 1700 క్యాలరీలు తీసుకోవాలి. రోజుకు 300 నుండి 500 క్యాలరీల లోటు ఉంచడం అత్యంత సురక్షితమైన మార్గం. దీనివల్ల కండరాలు బలహీనపడకుండా కేవలం కొవ్వు మాత్రమే కరుగుతుంది.
అతిగా తగ్గించడం వల్ల వచ్చే ముప్పు..
బరువు త్వరగా తగ్గాలనే ఆశతో రోజుకు 1000 క్యాలరీల కంటే తక్కువ తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయట. మహిళల్లో నెలసరి సమస్యలు, పురుషుల్లో హార్మోన్ల లోపం ఏర్పడవచ్చని అంటున్నారు. అలాగే ఎముకలు బలహీనపడటం, గుండెపై ఒత్తిడి పడటం, నిరంతరం అలసటగా అనిపించడం వంటివి జరుగుతాయి. అదే విధంగా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల తక్కువ ఆహారం వల్ల నిద్రలేమి, చిరాకు (Mood swings) పెరుగుతాయి.
సహజంగా బరువు తగ్గడానికి 5 సూత్రాలు..
తీపికి దూరం: కూల్ డ్రింక్స్, సోడాల బదులు నీళ్లు ఎక్కువగా తాగాలి.
ప్రోటీన్: ఆహారంలో ప్రోటీన్ పెంచితే కండరాలు దృఢంగా ఉంటాయి.
రిఫైన్డ్ ఫుడ్ వద్దు: మైదా, తెల్ల బియ్యం తగ్గించి ముడి ధాన్యాలు (Whole Grains) తీసుకోవాలి.
శారీరక శ్రమ: జిమ్‌కు వెళ్లకపోయినా రోజుకు కనీసం 30-40 నిమిషాలు నడవాలి.
ఓపిక: బరువు తగ్గడం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. తక్షణ ఫలితాల కోసం ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొందరు నిపుణుల సలహలు, సూచనల మేరకు మాత్రమే పేర్కొన్నది. మీరు అనారోగ్య సమస్యలతో బాధపడే వారైతే సంబంధిత వైద్యుడిని సంప్రదించడం మేలు.)


































