ఈసారి ట్రాఫిక్ నిబంధల్లో పోలీసులు సరికొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నారు. పరేడ్‌కు వచ్చే సామాన్యులకు, ఆహ్వానితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు పార్కింగ్ కోసం క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ మేరకు ట్రాఫిక్‌కుసంబంధించిన అదనపు పోలీసు కమిషనర్ దినేష్ కుమార్ గుప్తా వివరాలను వెల్లడించారు. పరేడ్ జరిగే కర్తవ్య పథ్ చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, రాజధాని నలుమూలల వైపు పోలీసులను మోహరిస్తున్నామన్నారు. ప్రతి కూడలిలోనూ ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వారి పని పరేడ్ సజావుగా సాగేలా చూడటమే వారి లక్ష్యమని పేర్కొన్నారు.
22 పార్కింగ్ జోన్లు:
పరేడ్‌ను చూడటానికి వచ్చే వారి కోసం ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాట్లను చేస్తున్నారు. కర్తవ్య పథ్ పరిసరాల్లోని ప్రాంతాల్లో సుమారు 22 పార్కింగ్ జోన్లను గుర్తించారు. ఏ వాహనం ఎక్కడ పార్క్ చేయాలో స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. ఈ విషయంలో ట్రాఫిక్ సిబ్బందికి పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన బ్రీఫింగ్ కూడా అందించారు. నిర్ణీత మార్గాల్లోని వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ అనేది కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
సరిహద్దుల వద్ద తనిఖీలు ముమ్మరం:
దిల్లీ సరిహద్దుల్లో భద్రతను బలగాలు కట్టుదిట్టం చేశాయి. బోర్డర్ పాయింట్ల వద్ద పోలీసులు సిబ్బంది మోహరించగా, ఇవాళ్టి రాత్రి నుంచి తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. ఎందుకంటే జనవరి 23న రిహార్సల్ ఉంటుంది. జనవరి 26 కోసం జనవరి 25 రాత్రి నుంచే ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ముందుకు వదులుతారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన వాహనాలను లోపలికి పంపించరు. పరేడ్ జరిగే ప్రధాన మార్గాలో సాధారణ వాహనాలు పూర్తిగా నిషేధం. అలాగే ట్రాఫిక్ మళ్లింపు కూడా రాత్రి నుంచే జరగనుంది. ఆయా రూట్లలో కేవలం అనుమతి ఉన్న వాహనాలకు మాత్రమే దారులు తెరుచుకోనున్నాయి. పాసులు లేని వాహనాలు లోపలికి అనుమతి లేదు. ప్రజలు ఈ విషయాలు గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. సాధారణ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని కోరారు.
క్యూఆర్ కోడ్ పార్కింగ్ సిస్టమ్:
ఈ ఏడాది కొత్తగా పార్కింగ్ కోసం నూతన విధానం తీసుకొచ్చారు. అదే క్యూఆర్ కోడ్ ఆధారిత పార్కింగ్ వ్యవస్థ. రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసే పాసులపై ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. వాహనదారులు తమ మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే మీ పార్కింగ్ వివరాలు తెలుస్తాయి. వెంటనే గూగుల్ మ్యాప్ ఓపెన్ అయి నేరుగా అక్కడికే వెళ్లి బండి పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల చాలా మేలు అవ్వనుంది. బీటింగ్ రిట్రీట్‌కు ప్రత్యేక ప్లాన్‌ను సిద్ధం చేశారు.
75 వేల మందికి ఆహ్వానం:
ఈసారి గణతంత్ర వేడుకలకు 75 వేల నుంచి 76 వేల మందికి ఆహ్వాన పత్రాలను కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఇంత భారీ జన సందోహం నియంత్రించడానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భద్రత, ట్రాఫిక్ నిర్వహణ కోసం సుమారు 4వేలు నుంచి 5 వేలు మంది పోలీసులను మోహరించారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతపై కూడా దృష్టి పెట్టనున్నారు. అత్యవసర వాహనాల కోసం ప్రత్యేకదారులు ఏర్పాటు చేస్తున్నారు.


































