కార్పొరేట్ కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలతో వరుసగా భేటీలను నిర్వహిస్తోన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వారికి వివరిస్తోన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న పారిశ్రామిక విధానాలు, రాయితీల గురించి తెలియజేస్తోన్నారు.
ఈ క్రమంలో- ఓ కీలక ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చారు నారా లోకేష్. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తోన్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన చట్టం అమలు తీరుపై లోతుగా అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. ఈ విధానం ఏ విధంగా పనిచేస్తుందో, తమ రాష్ట్రంలో అమలు చేయడానికి ఉన్న సాధ్యసాధ్యాలను విశ్లేషిస్తోన్నామని నారా లోకేష్ వివరించినట్లు ప్రముఖ బిజినెస్ పోర్టల్ బ్లూమ్‌బెర్గ్ న్యూస్ (Bloomberg) తెలిపింది.
నారా లోకేష్ ను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం- ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ను నిషేధించారని, దీనికి సంబంధించిన నిబంధనలపై అధ్యయనం చేస్తోన్నామని నారా లోకేష్ అన్నారు. దీనికోసం బలమైన చట్టపరమైన నిబంధనను రూపొందించాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఓ నిర్దుష్ట వయస్సు లోపు యువకులు సోషల్ మీడియాను ఉపయోగించకూడదని తాను గట్టిగా అభిప్రాయపడుతున్నట్లు అన్నారు.
సోషల్ మీడియాలో తాము చూస్తోన్న వాటిని అర్థం చేసుకోలేరని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ విషయంలో పిల్లల రక్షణ అత్యవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం మైనర్ల సోషల్ మీడియా వినియోగానికి తల్లిదండ్రుల నియంత్రణలు అమలులో ఉన్నాయి. సోషల్ మీడియాపై విస్తృతమైన ఆంక్షలు విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, హానికరమైన ఆన్‌లైన్ కంటెంట్‌పై కఠిన నియంత్రణలు కోరుతూ పలు పిటిషన్లు న్యాయస్థానంలో దాఖలైనప్పటికీ, రాష్ట్ర స్థాయిలో ఇటువంటి ఆంక్షలను అమలు చేయడం చట్టపరమైన, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటుందని నిపుణులు భావిస్తున్నారు. అటు మద్రాస్ హైకోర్టు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 16 ఏళ్లలోపు పిల్లలు ఇంటర్నెట్ వాడకాన్ని నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం మాదిరిగానే దేశంలోనూ ఒక శాసనాన్ని తీసుకురావడానికి గల అవకాశాలను పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

































