మేడారం మహా జాతరకు నిన్న మండ మెలిగే పండుగతో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. మేడారం మహా జాతర 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు నాలుగురోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది.
ఈ సంవత్సరం మేడారం జాతరను అత్యంత ఘనంగా నిర్వహించడం కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రభుత్వం అన్ని విధాల ఏర్పాట్లు చేసింది. ఇక మేడారంలో పర్యాటక అభివృద్ధి కోసం పర్యాటకశాఖ సైతం రంగంలోకి దిగింది.
తాడ్వాయి ఎలుబాక నుండి హెలికాఫ్టర్ సేవలు
మేడారం జాతరకు వెళ్లాలనుకునే భక్తులకు ములుగు జిల్లా నుండి హెలికాప్టర్ రైడ్లు ప్రారంభించారు అధికారులు. జాతర ప్రాంతాన్ని ఆకాశమార్గం నుండి వీక్షించే అవకాశం భక్తులకు కల్పిస్తున్నారు. పర్యాటకశాఖ తాడ్వాయి మండలం ఎలుబాక నుండి ఈ సేవలను అందిస్తోంది. పడిగాపూర్ వద్ద ప్రత్యేక హెలిపాడ్ లను ఏర్పాటుచేసి, ఈరోజు నుండే హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.
జాతర విహంగ వీక్షణకు చార్జీలు ఇలా, హన్మకొండ నుండి ప్రయాణానికి ధరలు ఫిక్స్
ఆరు నుండి ఏడు నిమిషాల పాటు జాతర విహంగ వీక్షణకు ఒక్కొక్కరికి 4800 రూపాయలను చార్జిగా నిర్ణయించారు. హనుమకొండ నుండి మేడారం ఆప్ అండ్ డౌన్ ప్రయాణానికి 35999 రూపాయలను వసూలు చేయనున్నారు. ఇక ఈ హెలికాప్టర్ సేవలు జనవరి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల వరకు ఈ హెలికాప్టర్ సేవలను అందిస్తున్నారు.
మేడారం జాతరకు మూడు కోట్ల మంది జనం
ఇప్పటికే వేలాది మంది భక్తులు మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతలకు బంగారాన్ని సమర్పిస్తూ భక్తి పరవశం తో మునిగిపోతున్నారు. ఈ సంవత్సరం మేడారం మహా జాతరకు మూడు కోట్ల మంది ప్రజలు వస్తారని అంచనాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టారు.
ఎడ్లబండి నుండి హెలికాఫ్టర్ ద్వారా శోభాయమానంగా మేడారం మహాజాతర
జియో ట్యాగింగ్ విధానంతో భక్తులు తప్పిపోకుండా తగిన చర్యలు చేపట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మేడారం మహా జాతర శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు, ట్రాఫిక్ కంట్రోల్ ను కూడా చేయనున్నారు. ఎడ్లబండి నుండి హెలికాప్టర్ సేవలు దాకా మేడారం మహా జాతర ఈసారి అత్యంత శోభాయమానంగా జరగనుంది.


































