ఫ్యామిలీకి రూ.78000.. మే నాటికి 2 లక్షల సోలార్ రూఫ్‌టాప్‌లు టార్గెట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద మే 2026 నాటికి 2 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్‌లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా ఫీడర్ సోలారైజేషన్, రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టుల సంసిద్ధత, పర్యవేక్షణను నిర్ధారించాలని, ఈ పథకం అమలు, దీర్ఘకాలిక పనితీరును నిర్ధారించాలని APSPDCLను ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించారు.

పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, సోలార్ రూఫ్‌టాప్, ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను జవాబుదారీతనంతో వేగంగా పూర్తి చేయాలని సీఎస్ చెప్పారు. వీటికి సంబంధించి భూసేకరణ, లీజు రిజిస్ట్రేషన్లు, క్లియరెన్స్, ప్రాజెక్టు అమలును త్వరగా పూర్తి చేయాలని సూచించారు.


సోలార్ రూఫ్‌టాప్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం చూస్తోంది. జనాలు అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే.. వేగవంతమైన ఆమోదాల కోసం విధానాలను సరళీకరించనుంది. మెరుగైన సేవలను అందించనుంది. మార్చి 2026 నాటికి 1.5 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్‌లను, మిగిలిన వాటిని మే 2026 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మరోవైపు వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా మీటర్లను అమర్చాలని ఫీల్డ్ ఆఫీసర్లను సీఎస్ ఆదేశించారు. లోపాలకు డివిజనల్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లను బాధ్యతలు వహించాలన్నారు.

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద కేంద్ర ప్రభుత్వం గృహాలకు సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్‌ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది. ఈ పథకంలో భాగంగా రూ.78000 వరకు సబ్సిడీ అందిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలును ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది. మిగిలిన కరెంట్‌ను డిస్కంలకు అమ్ముకునేలా కూడా ప్లాన్ చేస్తున్నారు.

ఈ పథకం పొందేవారికి రూ.78,000 సబ్సిడీ లభిస్తుంది. కేంద్రం దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు ఈ పథకాన్ని అమలు చేసేలా టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటివరకు 25 లక్షల ఇళ్లకు పూర్తైంది. ఏపీ ప్రజలు కూడా దీనిని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.