ఈ శుక్రవారం లీవ్ తీసుకుంటే లాంగ్ వీకెండ్.. రథసప్తమికి తిరుమల లేదంటే మేడారానికి ప్లాన్ చేయండి

ఈ శుక్రవారం లీవ్ తీసుకుంటే.. లాంగ్ వీకెండ్ దొరుకుతుంది. దీనితో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మేడారం జాతర, తిరుమల రథసప్తమికి ఎక్కువగా వెళ్తున్నారు.

ఉద్యోగం చేసే చాలా మంది ఎక్కువగా ఎదురుచూసేది లాంగ్ వీకెండ్ కోసం. ముందో.. వెనకో.. ఒక్క లీవ్ తీసుకుంటే.. మూడు, నాలుగు రోజులు ఎంజాయ్ చేసి రావొచ్చు. ఇప్పుడు కూడా మీరు లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. అందుకోసం ఒక్క లీవ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ సమయంలో మీరు అనేక ప్రాంతాలను తిరిగి రావొచ్చు.


జనవరి 23వ తేదీన శుక్రవారం లీవ్ తీసుకుంటే.. జనవరి 24న నాలుగో శనివారం, జనవరి 25 ఆదివారం, జనవరి 26 రిపబ్లిక్ డే కలిసి వస్తుంది. నాలుగు రోజులు కలిసి రావడంతో మంచి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే తిరుమల రథసప్తమి, మేడారం మహాజాతరకు వెళ్లి రావొచ్చు. ఈ సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయంలోనూ రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ లీవ్స్ మాత్రమే కాదు.. బ్యాంకు ఉద్యోగులు జనవరి 27వ తేదీన సమ్మె కూడా చేస్తున్నారు. వారానికి ఐదు రోజుల పని దినాలు కల్పించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

తిరుమల ప్లాన్ చేయండి

ఈ నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ సమయంలో తిరుమలకు వెళ్లాలి అనుకునేవారు రథసప్తమి వేడుకలను చూసి రావొచ్చు. జనవరి 25వ తేదీన రథసప్తమి సందర్భంగా ఒకేరోజు స్వామివారికి వాహనసేవలు ఉంటాయి. ఆలయ మాఢవీధుల్లో స్వామివారు భక్తులను దర్శనమిస్తారు.

  • జనవరి 25వ తేదీ తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) – సూర్యప్రభ వాహనం.
  • ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.
  • ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.
  • మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.
  • మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.
  • సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.
  • సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.
  • రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.

ఈ రోజున కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల రద్దు ఉంటుంది.

అరసవల్లి సూర్యదేవాలయం

రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయాన్ని కూడా చాలా మంది దర్శించుకుంటారు. జనవరి 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కార్యక్రమాలు ఉన్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యాన్ని కల్పించారు. రథసప్తమి రోజున క్షీరాభిషేకం టికెట్ ధరను ప్రభుత్వం రూ. 500 గా నిర్ణయించింది. రూ. 100, రూ. 500 ధరలతో ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా ఉంటాయి.

మేడారం జాతర

ఇక తెలంగాణలో జరిగే మేడారం మాహాజాతరకు ఇప్పటికే జనాలు భారీగా వెళ్తున్నారు. జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. కానీ ముందు నుంచే ఇక్కడ వనదేవతలకు మెుక్కులు చెల్లించుకుంటారు. లాంగ్ వీకెండ్ సందర్భంగా మేడారం వెళ్లిరావొచ్చు. అంతేకాదు దగ్గరలోనే అనేక పర్యాటక ప్రాంతాలు కూడా కవర్ చేయవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.