భారత్‌లో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. ఇంకా పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటున్న నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు ఇంకా డీజిల్ వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
మంచి మైలేజ్, బలమైన టార్క్, హైవేల్లో సాఫీగా నడిచే సామర్థ్యం ఇవన్నీ డీజిల్ ఇంజిన్లకు ఉన్న ప్రధాన బలాలు. కాలుష్య నియమాలు కఠినమైనా, కొత్త టెక్నాలజీతో డీజిల్ వాహనాలు ఇప్పటికీ మార్కెట్‌లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో కియా, హ్యుందాయ్, మహీంద్రా, టాటా, టయోటా వంటి ప్రముఖ కంపెనీలు డీజిల్ వాహనాలను అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని మోడళ్లు వినియోగదారుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి.
కియా సెల్టోస్ డీజిల్ వేరియంట్ ఆధునిక ఫీచర్లతో వచ్చే ఎస్‌యూవీ. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది మంచి పవర్‌తో పాటు బలమైన పికప్‌ను ఇస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ రెండు గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. స్టైల్, టెక్నాలజీ కావాలనుకునే కుటుంబాలకు ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది. అదే ఇంజిన్‌ను చిన్న సైజ్‌లో కోరుకునే వాళ్లకు హ్యుందాయ్ వెన్యూ బెస్ట్ కారు. నగరంలో సులభంగా నడిపించవచ్చు. హైవేల్లోనూ మంచి మైలేజ్ ఇస్తుంది. డీజిల్ వేరియంట్‌లో ఇది సాఫీ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుందని వినియోగదారులు చెబుతున్నారు.
ఆఫ్‌రోడ్ ప్రయాణాలు ఇష్టపడే వాళ్లకు మహీంద్రా థార్ రాక్స్ బెస్ట్ ఎస్‌యూవీ. బలమైన డీజిల్ ఇంజిన్‌తో పాటు ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉండటంతో కొండలు, అడవులు, చెడు రోడ్లలోనూ ఇది ఎలాంటి ఇబ్బంది లేకుండా దూసుకుపోతుంది. అడ్వెంచర్ లవర్స్‌ను ఎంతో ఆకట్టుకుంటుంది. మరోవైపు.. హ్యాచ్‌బ్యాక్ కార్లలో డీజిల్ ఇంజిన్ కావాలంటే టాటా ఆల్ట్రోస్ ఒక్కటే ఆప్షన్. ఇది మంచి సేఫ్టీ రేటింగ్‌తో పాటు విశాలమైన ఇంటీరియర్‌ను అందిస్తుంది. రోజూ ఆఫీస్‌కు వెళ్లేవాళ్లకు, చిన్న కుటుంబాలకు ఇది ఉపయోగకరమైన కారు.
ఇక కుటుంబంతో కలిసి ఎక్కువ ప్రయాణాలు చేసే వాళ్లకు టయోటా ఇన్నోవా క్రిస్టా ఎప్పటికీ నమ్మకమైన పేరు. డీజిల్ ఇంజిన్ బలంగా ఉండటంతో పాటు, కంఫర్ట్ విషయంలో ఇది ముందుంటుంది. దీర్ఘకాలం ఉపయోగించినా పెద్దగా సమస్యలు రాకపోవడం దీనికి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. త్వరలో ఈ మోడల్ నిలిపివేసే అవకాశం ఉందని వార్తలు రావడంతో ఆసక్తి ఉన్నవాళ్లు ముందే నిర్ణయం తీసుకోవడం మంచిదని ఆటో రంగం చెబుతోంది. మొత్తానికి, మంచి మైలేజ్‌తో పాటు బలమైన పనితీరు కోరుకునే వారికి ఈ డీజిల్ కార్లు ఇప్పటికీ బెస్ట్ ఛాయిస్‌గా గుర్తింపు పొందింది. అవసరాన్ని బట్టి సరైన మోడల్ ఎంచుకోండి.


































