ఈ కొత్త బడ్జెట్లో వ్యవసాయానికి సంబంధించి తాత్కాలిక సబ్సిడీలకు పరిమితం కాకుండా ఉత్పాదకత, మార్కెట్ ఆధారిత వృద్ధి, స్థిరత్వం దిశగా వ్యవసాయాన్ని తీసుకెళ్లే విధాన నిర్ణయాలను చేస్తోంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఒక సీనియర్ అధికారి ఒకరు కొన్ని వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఈసారి బడ్జెట్లో సబ్సిడీ సంస్కరణలు, వాతావరణ రెసిలియంట్ పద్ధతులు, కోల్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ వ్యవసాయం వంటివి ప్రధాన ప్రాధాన్యతలుగా ఉంటాయని అన్నారు.
రూ.6 వేల నుంచి రూ.8 వేలు పెంపు :
అలాగే పశుపోషణ, ఉద్యాన వనాలు, మత్స్య సంపద వంటి అనుబంధ రంగాలపై దృష్టి సారించడం ద్వారా రైతుల ఆదాయాలను గణనీయంగా పెంచేందుకు చర్యలు చేపట్టనుంది. కేంద్ర బడ్జెట్ కోసం ప్రాథమిక నివేదికలు, అంచనాల ఆధారంగా కేటాయింపుల పెంపుదల, డిజిటల్ స్వీకరణ, వాతావరణ స్థితి స్థాపక పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగం బలోపేతంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రత్యక్ష నగదు ప్రయోజనాల కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల ఆర్థిక సాయాన్ని రూ.8 వేలకు పెంచనున్నారు. దీంతో చిన్న, సన్నకారు రైతులకు ఈ బడ్జెట్ మద్దతు ఇవ్వనుంది.
అలాగే కొత్త బడ్జెట్లో వ్యవసాయ రుణాన్ని పెంచే అవకాశాలు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాడి పరిశ్రమ, పశు సంవర్ధక, మత్స్య రుణాలను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించనున్నారు. ఇందుకు పూచీకత్తు లేని రుణాల పరిమితిని పొడిగించనున్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టనున్నారు. రైతులను నష్టాల నుంచి రక్షించడానికి రూ.30 లక్షల వరకు జరిమానా లేదా 3 ఏళ్లు జైలు శిక్ష విధించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విత్తన చట్టాన్ని తీసుకురానుంది.
డిజిటల్ వ్యవసాయం క్షేత్రాలు :
దీంతో పాటు మెరుగైన నాణ్యత గల, తెగులు నిరోధక, అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలపై జాతీయ మిషన్ వైపు ముందుకు సాగనున్నారు. అలాగే మౌలిక సదుపాయాలు, గిడ్డంగులు పెంచడం, శీతలీకరణ, పంటకోత తర్వాత నష్టాలను తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. మెరుగైన ధరల కోసం మరిన్ని మండీలను ఈనామ్ ప్లాట్ ఫాం అనుసంధానం చేయనుంది. సాంకేతికత, స్థిరమైన డిజిటల్ వ్యవసాయం(అగ్రిస్టాక్) అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రైతు డేటా, భూమి రికార్డులు, మార్కెట్ ప్లాట్ ఫాం ఏకీకరణతో సహా డిజిటల్ కార్యక్రమాలకు నిధులను అందించడంతో ప్రధాన ప్రోత్సాహకాలను ఇవ్వనున్నారు.
































