జెన్కో తాజాగా విడుదల చేసిన బదిలీ మార్గదర్శకాలపై తీవ్ర దుమారం చెలరేగుతున్నది. ఆంధ్రా ఉద్యోగులను అందలం ఎక్కించేలా, తెలంగాణ వారికి అన్యాయం జరిగేలా నిబంధనలు రూపొందించారనే ఆరోపణలొస్తున్నాయి.
15 ఏండ్ల నిబంధనతో ‘ఆంధ్రా స్థానికత’ కలిగిన ఉద్యోగులకే విద్యుత్తు సౌధకు బదిలీ అయ్యే అవకాశం లభిస్తుందని చెప్తున్నారు.
మానవ వనరుల విభాగంలోని ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వడం, ఖాళీలను చూపకపోవడంపై కూడా ఉద్యోగులు అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఏఈలుగా ఉన్నవారందరూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నియామకమైన వారే. పదేండ్ల లోపు సర్వీసు ఉన్నవారే. అయితే, ఇటీవల జారీచేసిన బదిలీ మార్గదర్శకాల ప్రకారం.. హైదరాబాద్ విద్యుత్తు సౌధకు ట్రాన్స్ఫర్ కావాలంటే కనీసం 15 ఏండ్లు విద్యుత్తు కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనే తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులకు శాపంగా మారుతున్నది. ఈ నిబంధన కారణంగా.. ‘తెలంగాణ స్థానికత’ కలిగిన వారు మరో ఐదేండ్లు పనిచేస్తేగానీ విద్యుత్తు సౌధకు వచ్చే అవకాశం ఉండదని, ఏడీఈ, డీఈ క్యాడర్లలో కూడా మెజారిటీ ‘ఆంధ్రా స్థానికత’ కలిగిన ఉద్యోగులే విద్యుత్తు సౌధకు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 15 ఏండ్ల నిబంధన, విజయవాడలో పనిచేసిన సర్వీసును హైదరాబాద్‌లో పనిచేసిన సర్వీసుతో సమానంగా పరిగణించకపోవడంతో ఏడీఈ, డీఈ స్థాయి ఉద్యోగులకు కూడా హైదరాబాద్ విద్యుత్తు సౌధలో పనిచేసే అవకాశం దక్కకుండా పోతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
అకౌంట్స్ ఉద్యోగులకు నో ట్రాన్స్ఫర్
హైదరాబాద్‌లో పదేండ్లు, ఆ పైబడి పనిచేసిన వారికి బయటి ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాలనేది ప్రధాన నిబంధన. అయితే, జేఏవో క్యాడర్లో హైదరాబాద్‌లో పదేండ్లు పైబడి పనిచేసిన వారి సర్వీసును లెక్కించకపోవడం, బయటి ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేకపోవడంతో విద్యుత్తు సౌధలో ఖాళీలు ఏర్పడే అవకాశం కనిపించడం లేదు. దీంతో విద్యుత్తు కేంద్రాల్లో 15 ఏండ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం హైదరాబాద్‌కు బదిలీ అయ్యే దారులు మూసుకుపోయినట్టేనని ఉద్యోగ సంఘా ల నేతలు చెప్తున్నారు. అన్నీ ఉన్న విద్యుత్తు కేంద్రాలతో సమానంగా సదుపాయాల్లేని మారుమూల ప్రాంతాల్లోని కేంద్రాలను పరిగణించవద్దని, సౌకర్యాల ఆధారంగా వెయిటేజ్ పాయింట్లు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు చేస్తున్న డిమాండ్‌ను పట్టించుకోకుండానే బదిలీ మార్గదర్శకాలు విడుదల చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ఎస్పీడీసీఎల్లో బదిలీలపై బ్యాన్ ఎత్తివేత
టీజీఎస్పీడీసీఎల్లో ఉద్యోగుల బదిలీలపై బ్యాన్ ఎత్తివేస్తూ సంస్థ చైర్మన్ అండ్ ఎండీ ముషారఫ్ ఫారూఖీ ఉత్తర్వులు జారీచేశారు. 2026 జనవరి 1 నాటికి ప్రస్తుత ఉద్యోగంలో రెండేండ్ల కాలవ్యవధి పూర్తిచేసిన ఉద్యోగులకు ప్రతి క్యాడర్లో 50% వర్కింగ్ స్ట్రెంత్‌కు పరిమితం కానున్నట్టు తెలిపారు. ఉద్యోగ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిని అర్హతను బట్టి బదిలీ చేయాలని సూచించారు. డిస్కం క్యాడర్‌ను కార్పొరేట్ ఆఫీసుకు, సర్కిల్ క్యాడర్‌ను సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా, డివిజన్ క్యాడర్‌ను డివిజనల్ ఇంజినీర్‌గా బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
































