ఏపీలోని స్వర్ణ గ్రామం (గ్రామ సచివాలయం), స్వర్ణ వార్డు(వార్డు సచివాలయం) ల్లో ఓ కీలక వ్యవస్ధను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే నియామకాలు కూడా ప్రారంభించింది.
వచ్చే నెల నుంచే దీన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఈ కొత్త వ్యవస్ధను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో (secretariats) ఉన్న సిబ్బందిలో జవాబుదారీతనం పెంచేందుకు, తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మూడంచెల అధికారుల వ్యవస్ధను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ముందుగా సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజిస్తారు. అనంతరం వీటిలో ఉద్యోగుల సర్దుబాట్లు చేస్తారు. ఆ తర్వాత వీరిపై ఉన్నతాధికారుల్ని మూడు అంచెల్లో నియమిస్తారు. వీరు సచివాలయాల పనితీరును తమ తమ స్ధాయిలో పర్యవేక్షిస్తారు.
తాజా విధానం ప్రకారం ఒక్కో సచివాలయంలో ఆరు నుంచి 8 మంది ఉద్యోగులు ఉండేలా చూస్తారు. అనంతరం వీరిపై పర్యవేక్షణ కోసం జిల్లా, మున్సిపల్, మండల స్ధాయిలో అధికారుల్ని నియమిస్తారు. జిల్లా కేంద్రాల్లో శాశ్వత అధికారుల్ని నియమిస్తారు. ఇలా రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయతీల్లో మున్సిపల్ శాఖ నుంచి అదనపు కమిషనర్ స్ధాయి అధికారుల్ని డిప్యుటేషన్ పై నియమిస్తున్నారు.
అలాగే మండలాల స్ధాయిలో సచివాలయాలపై పర్యవేక్షణకు డిప్యూటీ ఎంపీడీవోల్ని డిప్యుటేషన్ పై తీసుకుంటున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఈ అధికారుల్ని సర్దుబాటు చేస్తోంది. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో అదనంగా ఉన్న ఉద్యోగుల్ని దేవాదాయశాఖకు కేటాయించాలని కూడా నిర్ణయించారు. వీరిని దేవాదాయశాఖలోకి విలీనం చేసుకుని గ్రేడ్ 3 ఈవోలుగా పోస్టింగ్స్ ఇస్తారు. అలాగే కమిషనర్ కార్యాలయంలోనూ సచివాలయాల్లో అదనంగా ఉన్న సిబ్బందిని తీసుకోనున్నారు.




































