పాపులర్ హ్యాచ్‌బ్యాక్ హోండా జాజ్ సరికొత్త 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో గ్లోబల్ మార్కెట్లో మెరిసింది. అద్భుతమైన డిజైన్ మార్పులు, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ కారు ధర, విశేషాలు ఇప్పుడు వాహన ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాటిని మిరూ చూసేయండి..
భారత దేశ మధ్యతరగతి కుటుంబాలకు ఒకప్పుడు ‘లగ్జరీ హ్యాచ్‌బ్యాక్’ అంటే గుర్తొచ్చే పేరు హోండా జాజ్. అప్పట్లో తన విశాలమైన క్యాబిన్, స్మూత్ డ్రైవింగ్‌తో భారత రోడ్లపై ఒక వెలుగు వెలిగిన ఈ కారును డిస్కంటిన్యూ చేసింది హోండా సంస్థ. ఇక ఇప్పుడు సరికొత్త 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో మళ్లీ వార్తల్లో నిలిచింది. చైనా మార్కెట్లో విడుదలైన ఈ 2026 హోడా జాజ్.. మునుపటి కంటే మరింత షార్ప్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
2026 హోండా జాజ్- కొత్త లుక్.. అదిరిపోయే హంగులు!
ఈ 2026 జాజ్ మోడల్లో హోండా ప్రధానంగా డిజైన్‌పై ఫోకస్ పెట్టింది.
ముందు భాగం: కొత్తగా వచ్చిన ‘స్ల్పిట్-ఎల్ఈడీ’ హెడ్‌ల్యాంప్స్ కారుకు ఒక అగ్రెసివ్ లుక్‌ను ఇచ్చాయి. గ్రిల్ కూడా మునుపటి కంటే సన్నగా మారి, కారుకు మోడ్రన్ టచ్ ఇచ్చింది.
రంగులు: ఈసారి డైనమిక్ బ్లూ, ఫైరీ ఎల్లో, స్టార్రి నైట్ వైట్ వంటి మూడు సరికొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేశారు.
సైజు: ఈ 2026 హోండా జాజ్ కారు వెడల్పు, ఎత్తు మారకపోయినా, పొడవు మాత్రం స్వల్పంగా పెరిగి 4,169 మిమీకి చేరుకుంది. దీనివల్ల కారు రోడ్డుపై మరింత రాజసంలా కనిపిస్తుంది.
2026 హోండా జాజ్- క్యాబిన్లో మార్పులేంటి?
హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ లోపల భారీ మార్పులు చేయకపోయినా, అవసరమైన వాటిని మాత్రం హోండా అప్‌గ్రేడ్ చేసింది.
టచ్‌స్క్రీన్: పాత మోడల్లోని చిన్న స్క్రీన్ స్థానంలో ఇప్పుడు 10.1 ఇంచ్ భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చింది.
ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్: డ్రైవర్ కోసం 7-ఇంచ్ డిజిటల్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు.
సింప్లిసిటీ: అయితే, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఫ్యాబ్రిక్ సీట్లు, బేసిక్ ఆడియో సిస్టమ్‌నే కొనసాగించారు. హోండా ఫేమస్ ‘మ్యాజిక్ సీట్స్’ ఈ చైనా వెర్షన్లో కనిపించకపోవడం కొంచెం నిరాశ కలిగించే విషయమే.
2026 హోండ్ జాజ్- ఇంజిన్ పవర్ఫుల్.. పెర్ఫార్మెన్స్ అదిరిపోతుంది!
మెకానికల్‌గా చూస్తే ఇందులో పాత నమ్మకమైన 1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్నే వాడారు. ఇది 122 బీహెచ్పీ పవర్‌ని, 145 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. హైబ్రిడ్ ఆప్షన్ లేకపోయినా, సిటీ డ్రైవింగ్‌కు ఈ ఇంజిన్ చాలా స్మూత్‌గా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
2026 హోండా జాజ్- ధర..
ఈ 2026 హోండా జాజ్ ధర చైనాలో సుమారు 66,800 యువాన్ల నుంచి ప్రారంభమవుతుంది. అంటే మన దేశీ కరెన్సీలో సుమారు రూ. 8.7 లక్షలు.
2026 హోండ్ జాజ్- ఇండియాలోకి వస్తుందా?
హోండా జాజ్ అంటే మన భారతీయులకు ఒక ప్రత్యేకమైన ఎమోషన్. అయితే ప్రస్తుతానికి ఈ 2026 మోడల్ చైనా మార్కెట్ కోసమే రూపొందించారు (కేవలం 3,000 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు). ఇండియాలో హోండా ప్రస్తుతం ఎలివేట్, అమేజ్ వంటి మోడళ్లపై దృష్టి పెట్టినందున, ఈ కొత్త జాజ్ మన దేశానికి ఇప్పుడప్పుడే వచ్చే సూచనలు కనిపించడం లేదు.
కానీ, ఒకవేళ ఇదే ధరలో భారత్‌కు వస్తే మాత్రం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం!


































