ఆరోగ్యంగా ఉండాలని మనం ప్రతిరోజూ ఒక గ్లాసు పండ్ల రసం తాగుతుంటాం. పండ్ల నుంచి వచ్చేదే కాబట్టి ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నమ్ముతాం. కానీ, నిజంగా జ్యూస్ తాగడం వల్ల పండు తిన్నంత ప్రయోజనం ఉంటుందా? ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి పండ్ల రసం వరం కంటే శాపంగా మారే అవకాశం ఉందా? అనేది తెలుసుకుందాం..
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న ఈ రోజుల్లో చాలామంది ఫ్రూట్ జ్యూస్ తాగడం చాలా ఆరోగ్యకరమని భావిస్తుంటారు. ముఖ్యంగా షుగర్ ఉన్నవారు కూడా పండ్ల రసాలను ఎంచుకుంటూ ఉంటారు. అయితే పండ్లను రసంగా తీసుకోవడం కంటే.. పండును నేరుగా తినడమే శరీరానికి వంద రెట్లు మేలు చేస్తుందని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. అసలు జ్యూస్ తాగడం వల్ల వచ్చే నష్టాలేంటి? పండు తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.
జ్యూస్ తాగడం వల్ల కలిగే అనర్థాలు
రక్తంలో చక్కెర పెరుగుదల: పండ్లను జ్యూస్ చేసినప్పుడు అందులోని సహజ చక్కెరలు శరీరానికి చాలా వేగంగా చేరుతాయి. ముఖ్యంగా మార్కెట్లో దొరికే ప్యాక్డ్ జ్యూస్లు తాగినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది డయాబెటిస్ రోగులకు అత్యంత ప్రమాదకరం.
పీచు పదార్థం కోల్పోవడం: పండ్ల వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఫైబర్. జ్యూస్ తీసే ప్రక్రియలో ఈ ఫైబర్ దాదాపు పూర్తిగా తొలగిపోతుంది. ఫైబర్ లేకపోవడం వల్ల చక్కెర నేరుగా రక్తంలో కలిసిపోయి అనారోగ్యానికి దారితీస్తుంది.
అధిక కేలరీలు: ఒక గ్లాసు రసం తయారు చేయాలంటే కనీసం మూడు నాలుగు పండ్లు వాడాల్సి ఉంటుంది. దీనివల్ల శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు, చక్కెర అందుతాయి. ఫలితంగా బరువు పెరగడం, షుగర్ లెవల్స్ నియంత్రణ తప్పడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
పండును నేరుగా తింటే వచ్చే లాభాలు
పండును నేరుగా నమలి తినడం వల్ల శరీరానికి పుష్కలంగా ఫైబర్ అందుతుంది. ఈ ఫైబర్ రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీనివల్ల షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. పండ్లలోని విటమిన్లు, ఖనిజాలు ఏమాత్రం వృథా కాకుండా శరీరానికి అందుతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. ఆకలిగా ఉన్నప్పుడు జ్యూస్ కంటే పండు తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది జంక్ ఫుడ్ తినకుండా మిమ్మల్ని అడ్డుకుంటుంది.
డైటీషియన్ ముస్కాన్ కుమారి ప్రకారం.. ఒకవేళ మీరు జ్యూస్ తాగాలనుకుంటే, ఇంట్లో తయారుచేసిన తాజా రసాలను మాత్రమే చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ప్యాక్ చేసిన జ్యూస్లను పూర్తిగా నివారించడం ఉత్తమం. డయాబెటిస్ ఉన్నవారు ఏవైనా పండ్లు తీసుకునే ముందు తమ వైద్యులను సంప్రదించడం మంచిది.

































