డ్వాక్రా గ్రూపు బ్యాంక్ ఖాతాలపై విధిస్తున్న ఛార్జీలను తగ్గించాలని సీఎం చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. ప్రస్తుతం 15 రకాల ఛార్జీలు వేస్తున్నారని… వీటిని తగ్గించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వాలని… అప్పుడే అన్ని రంగాల్లో వాళ్లు ఎదుగుతారని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాలు తీసుకునే పరిస్థితి రావాలని అభిప్రాయపడ్డారు. బ్యాంకర్లు ఆ దిశగా పని చేయాలని సూచించారు. సచివాలయంలో 233, 234వ ఎస్ఎల్బీసీ సమావేశంలో వివిధ రంగాలకు ఇచ్చే రుణాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెన్యూవబుల్ ఎనర్జీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయని వివరించారు. “డిస్కంలు కూడా కౌంటర్ గ్యారెంటీ ఇస్తున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు ఇచ్చే రుణాలపై మరింత చొరవ చూపాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వాలి… అప్పుడే అన్ని రంగాల్లో ఎదుగుతారు. బడుగుల కోసం ప్రభుత్వాలుగా మేం చేయాల్సింది చేస్తున్నాం. బ్యాంకర్ల వైపు నుంచి సహకారం ఉండాల్సిందే” అని సీఎం చంద్రబాబు సూచించారు.
రాజధాని అమరావతిని ఫైనాన్స్ సంస్థలకు కేంద్రంగా చేయాలని భావిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. “బ్యాంకులు సహా వివిధ ఆర్థిక రంగ సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. 15 బ్యాంకుల కార్యాలయాల ఏర్పాటుకు ఇటీవలే శంకుస్థాపన చేశాం. నిర్మాణాలు మరింత ఊపందుకుని త్వరితగతిన పూర్తి కావాలి” అని పేర్కొన్నారు.
డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసిన విధంగానే… ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను బలోపేతం చేయాలన్నారు. టిడ్కో ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు ఆ టిడ్కో ఇళ్లకు రుణాలు ఇచ్చేందుకు కూడా బ్యాంకర్లు అంగీకరించడం లేదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి మావైపు నుంచి ప్రయత్నిస్తున్నామని… బ్యాంకర్లు కూడా సహకరించాలని కోరారు.
ఛార్జీలను తగ్గించాలి – సీఎం చంద్రబాబు
“డ్వాక్రా గ్రూపు బ్యాంక్ ఖాతాలపై 15 రకాల ఛార్జీలు వేస్తున్నారు. బ్యాంకర్లు ఈ ఛార్జీలను తగ్గించాలి. భూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. గత ప్రభుత్వం 22ఏ పేరుతో భూ వివాదాలు సృష్టించింది. ఇప్పుడు భూ రికార్డులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నాం. క్యూఆర్ కోడ్ ఇస్తూ పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. బ్యాంకర్లు కూడా బ్యాంక్ ఖాతాల కోసం క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుందేమో ఆలోచించండి” అంటూ పలు సూచనలు చేశారు.
ఎంఎస్ఎంఈ రంగాన్ని ఎక్కువ ప్రొత్సహించాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు. “ఏపీలో రూ.2 లక్షల కోట్ల మేర రుణాలను రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశాం.. ఇప్పటి వరకు రూ.49 వేలకోట్లు రీ షెడ్యూల్ చేశాం. రుణాల రీ-షెడ్యూల్ వల్ల రూ.1108 కోట్ల మేర ఆదా చేయగలిగాం. ఎంఎస్ఎంఈలకు, అలాగే వివిధ కీలక రంగాలు అభివృద్ధి జరిగేలా బ్యాంకర్ల సహకారం కావాలి.వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూతనిచ్చే ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం, బ్యాంకర్లే వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది” అని సీఎం అభిప్రాయపడ్డారు.


































