18వ రోజ్ గార్ మేళా.. 61వేల మందికి నియామక పత్రాలు అందించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

18వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో భాగంగా ఇవాళ (జనవరి 24న) కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన యువతకు 61,000కి పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందజేయనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ నియామక పత్రాలను అభ్యర్థులకు అందజేస్తారు. అనంతరం అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతను చూపిస్తుంది.


రోజ్‌గార్ మేళా అనేది యువతకు ఉపాధి కల్పించడం, వారి భవిష్యత్తును బలోపేతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక కీలక కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 17 రోజ్‌గార్ మేళాలు నిర్వహించబడ్డాయి. వాటి ద్వారా ఇప్పటివరకు 11 లక్షలకు పైగా మంది యువతకు నియామక పత్రాలను ప్రధాని అందించారు. ఇది నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో ఒక పెద్ద ముందడుగుగా భావించవచ్చు.

45 ప్రాంతాల్లో నిర్వహణ:

ఈ 18వ రోజ్‌గార్ మేళా దేశమంతటా ఒకేసారి 45 ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వనున్నారు. ఎంపికైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నారు.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా శాఖతో పాటు ఇతర ముఖ్యమైన శాఖల్లో ఈ నియామకాలు జరుగుతాయి. ఈ ఉద్యోగాలు యువతకు స్థిరమైన ఆదాయం, సామాజిక భద్రతతో పాటు దేశ సేవ చేసే అవకాశాన్ని కూడా అందిస్తాయి. మొత్తంగా, రోజ్‌గార్ మేళా భారతదేశ యువతకు ఆశా కిరణంగా నిలుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.