కిడ్నీ సమస్య అది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు.. ఆ కుటుంబానికి ఒక ఆర్థిక విపత్తు. డయాలసిస్ (Dialysis) చేయించుకోవాలంటే వందల కిలోమీటర్ల ప్రయాణం, ప్రైవేటు ఆసుపత్రుల్లో వేల రూపాయల ఖర్చు..
మధ్యతరగతి, పేద వర్గాలకు అందని ద్రాక్షలా ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మారుమూల గ్రామాల్లోని బాధితులకు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. రక్తశుద్ధి కేంద్రాలను రోగి ముంగిటకే తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సెకండరీ ఆసుపత్రుల్లో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో ప్రకటించిన వాటికి అదనంగా మరో 5 కేంద్రాలను మంజూరు చేయడం గమనార్హం. ఇందులో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఏమిటంటే.. రెండు కేంద్రాలను గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం. దీనివల్ల కొండకోనల్లో నివసించే నిరుపేదలకు ప్రాణవాయువు అందినట్లవుతుంది.
కొత్త డయాలసిస్ సెంటర్లు ఇవే
ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులు మరియు క్షేత్రస్థాయి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ‘ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం’ (PMNDP) కింద ఐదు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి జిల్లాలోని రైల్వేకోడూరు, ప్రకాశం జిల్లాలోని కొండేపి, తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు, కడప జిల్లాలోని మైదుకూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు.
ఇవి కాకుండా భీమవరం, పీలేరు, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట, జమ్మలమడుగు వంటి ప్రాంతాల్లో టెండర్ల ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఎస్.కోట, సీతంపేటలో కేంద్రాలు ఇప్పటికే సిద్ధమై బాధితులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
భారీ వ్యయం.. మెరుగైన సౌకర్యాలు
ప్రతి డయాలసిస్ కేంద్రం అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటోంది. ఒక్కొక్క కేంద్రానికి సుమారు రూ. 85 లక్షల వ్యయంతో యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 13 కేంద్రాలకు కలిపి దాదాపు రూ. 11.05 కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రతి కేంద్రంలో 5 మెషీన్లు ఉంటాయి. రోజుకు మూడు షిఫ్టుల్లో డయాలసిస్ నిర్వహిస్తారు. అంటే ఒక్కో కేంద్రం ద్వారా నెలకు సుమారు 375 సెషన్లు నిర్వహించే వీలుంటుంది.
కార్పొరేట్ భారం నుంచి విముక్తి
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కసారి డయాలసిస్ చేయించుకోవాలంటే రూ. 3,000 నుండి రూ. 4,000 వరకు ఖర్చవుతుంది. నెలలో పది సార్లు చేయించుకోవాల్సి వస్తే ఆ భారం సామాన్యుడు భరించలేడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 247 కేంద్రాల ద్వారా (ఎన్టీఆర్ వైద్యసేవ, ఇతర అనుబంధ కేంద్రాలు) ఉచితంగా సేవలు అందిస్తోంది. 2024-25 ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఏకంగా రూ. 164 కోట్లను కేవలం కిడ్నీ బాధితుల కోసమే ఖర్చు చేయడం గమనార్హం.

































