అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

మెరికా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన మంచు తుఫాను వణికిస్తోంది. టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు 2వేల మైళ్ల విస్తీర్ణంలో ఈ తుఫాను ప్రభావం ఏర్పడింది.


దాదాపు 20 కోట్ల మందికి పైగా ప్రజలు శీతల వాతావరణం, మంచు హెచ్చరికల నీడలో జీవిస్తున్నారు.పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వాషింగ్టన్ డీసీతో పాటు అలబామా, జార్జియా, కెంటకీ, న్యూయార్క్, టెక్సాస్ సహా 16కు పైగా రాష్ట్రాలు ఇప్పటికే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి పోలార్ వోర్టెక్స్ కారణంగా దూసుకొస్తున్న అతి శీతల గాలులు, శక్తివంతమైన తుపాను వ్యవస్థతో కలవడంతో ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది.

ఈ మంచు తుపాను కారణంగా దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఫ్లైట్ అవేర్ డేటా ప్రకారం, ఈ వారాంతంలో ఇప్పటివరకు 8,000కు పైగా విమానాలను రద్దు చేశారు.

డెల్టా, అమెరికన్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వంటి ప్రధాన సంస్థలు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసి, టికెట్ మార్పు రుసుములను రద్దు చేశాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) కూడా టెక్సాస్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు పలు విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోవచ్చని హెచ్చరించింది.

మంచు ప్రభావం కేవలం ప్రయాణాలకే పరిమితం కాలేదు. గడ్డకట్టే వర్షం కారణంగా విద్యుత్ తీగలపై అంగుళం మందం వరకు మంచు పేరుకుపోయే ప్రమాదం ఉంది.

ఈ తుపాను సోమవారం వరకు కొనసాగి, న్యూయార్క్, బోస్టన్ వంటి ప్రధాన నగరాలపై ప్రభావం చూపనుంది. తుపాను తగ్గుముఖం పట్టినా, ఆ తర్వాత కూడా అత్యంత శీతల గాలులు, ప్రమాదకరమైన వాతావరణం కొనసాగుతుందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.