ఆలోచనా కేంద్రాలుగా గ్రంథాలయాలు

గ్రంథాలయాలంటే కేవలం పుస్తకాలు చదువుకునే ప్రదేశం మాత్రమే కాదని, అక్కడ తెలుసుకున్న విషయాలతో సమాజ హితం కోసం పాటుపడే సరికొత్త ఆలోచన కేంద్రాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అభిప్రాయపడ్డారు. కొందరు వీటిని పుస్తకాలు లభించే ప్రదేశాలుగా చూస్తారని, ఆ భావన సరైంది కాదన్నారు. గ్రంథాలయాల్లో చదివిన పుస్తకాల ద్వారా సరికొత్తగా ఆలోచనలు చేయాలని, వాటిని సమాజ అభివృద్ధికి వినియోగించేలా మార్చుకోవాలన్నారు. శనివారం రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సెంటర్‌లో హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ (హెచ్‌ఎల్‌ఎఫ్‌) 16వ ఎడిషన్‌ను నోబెల్‌ పురస్కార గ్రహీత కైలాష్‌ సత్యారి్థతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ మాట్లాడుతూ డిజిటల్‌ యుగంలోనూ పుస్తకాల ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదన్నారు.


డిజిటల్‌ మాధ్యమాలు పెరిగినప్పటికీ, ఆలోచించే మానవ మేధస్సు ఉన్నంత కాలం పుస్తకాలకు విలువ తగ్గదన్నారు. రచయితలు, గాయకులు, కళాకారులు, పండితులు, పౌరులు అందరూ ఒక్కచోట చేరి ఆలోచనలను పంచుకునే ప్రత్యేక వేదికగా హెచ్‌ఎల్‌ఎఫ్‌ ఎదిగిందన్నారు. దేశ, విదేశాల నుంచి సుమారు 150 మంది వక్తలు, రచయితలు, కళాకారులు ఈ వేడుకలో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాష్‌ సత్యార్థి రచించిన ‘కరుణ – ది పవర్‌ ఆఫ్‌ కంపాషన్‌’పుస్తకాన్ని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరుణ పుస్తకాన్ని ప్రస్తావిస్తూ కైలాష్‌ సత్యార్థి కరుణకు ఇచి్చన నిర్వచనం అత్యంత లోతైనదన్నారు. కరుణను కేవలం బలహీనమైన భావోద్వేగంగా కాకుండా, సమాజాన్ని ఏకం చేసే శక్తిగా ఆయన వివరించిన తీరు ప్రశంసనీయమన్నారు.

జ్ఞానం సమాజ పురోగతికి ఉపయోగపడాలి: కైలాష్‌ సత్యార్థి
జ్ఞానం కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సమాజ పురోగతికి దోహదపడే శక్తిగా మారాలని నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి స్పష్టం చేశారు. సమాజం మెరుగుపడాలనే సంకల్పం ఉన్న వ్యక్తులు ఒకే వేదికపై కలుసుకుని ఆలోచనలను పంచుకున్నప్పుడే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందన్నారు. సాహిత్యం, కళలు, సంగీతం, సినిమా వంటి రంగాలన్నింటినీ కలిపి నిర్వహించే హెచ్‌ఎల్‌ఎఫ్‌ కేవలం పుస్తక పఠనానికి మాత్రమే పరిమితం కాదని, మనస్సును ప్రపంచంతో అనుసంధానం చేయడానికి దోహదపడుతుందన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరంలో చిన్న స్థాయి నుంచి సెంట్రల్‌ లైబ్రరీ వరకు ఎన్నో ఉన్నాయన్నారు. వీటిని మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.